సంక్రాంతికి నెల ముందే ప్రయాణ కష్టాలు..

ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:13 IST)
సంక్రాంతికి నెల ముందే ప్రయాణ కష్టాలు మొదలయ్యాయి. బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోయాయి. ముఖ్యంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సుల్లో బుకింగ్‌ తెరిచిన ఒకట్రెండు గంటల్లోనే సీట్లన్నీ నిండిపోయాయి. 
 
జనవరి 13 వరకూ రిజర్వేషన్లు పూర్తయిపోవడం వల్ల సొంతూరు వెళ్లేందుకు ప్రయాణికులు తంటాలు పడుతున్నారు.
 
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు లక్షలాది మంది ఉన్నారు. పండక్కి ఊరెళ్లేవారిలో ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
మిగిలిన వాళ్లు 11, 12 తేదీల్లో.. హైదరాబాద్‌కు దగ్గరలోని తెలంగాణ జిల్లాల ప్రయాణికులు.. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు చెందిన కొందరు 12, 13 తేదీల్లో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 
హైదరాబాద్‌ నుంచి ఏపీ వైపు ఏపీఎస్‌ ఆర్టీసీ సగటున రోజుకు 600 బస్సులు నడుపుతోంది. దాదాపు అవన్నీ నిండిపోయాయి.
 
విజయవాడకు వెళ్లే కొన్ని సర్వీసులు, పగటి సమయంలో నడిచే మరికొన్ని ఇతర ప్రాంత సర్వీసుల్లోనే స్పల్పంగా సీట్లున్నాయి.
 
ఏపీ వైపు టీఎస్‌ఆర్టీసీ నిత్యం 300 వరకు బస్సులు నడుపుతోంది. వీటన్నింటిలోనూ సీట్లు నిండిపోయాయి.
 
 విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, భీమవరం, ఏలూరు, ఖమ్మం, భద్రాచలం వైపు బస్సుల్లో వెయిటింగ్‌లిస్ట్‌ పరిమితి దాటిపోయింది.
 
రైళ్లలో అవకాశం లేకపోవడంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు భారీగా ఛార్జీలు పెంచేస్తున్నారు. 
రిజర్వేషన్‌ ఇక్కట్లు లేని జనసాధారణ్‌ రైళ్లను ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు పెద్దసంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
 
 సంక్రాంతి ఐదు వేల ప్రత్యేక బస్సులు
 
రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు అయిపోవడంతో.. ఉభయ రాష్ట్రాల ఆర్టీసీలు ప్రత్యేక బస్సుల బుకింగ్‌ మొదలుపెట్టాయి.
 
ఇటీవలే బస్సుల ఛార్జీలు పెరగ్గా.. ఇప్పుడు ప్రత్యేక బస్సుల పేరుతో మరో 50 శాతం వసూలు చేస్తుండటంతో ప్రయాణికులపై ఛార్జీల భారం గణనీయంగా పడుతోంది. 
 
టీఎస్‌ఆర్టీసీ గతేడాది 4,500 వరకు ప్రత్యేక బస్సులు నడపగా.. ఈసారి 5వేల వరకు సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ప్రణాళిక రూపొందిస్తోంది.
 
టికెట్‌ తీసుకోలేం.. నిలబడి ప్రయణించలేం...
ప్రధాన రైళ్లన్నింటిలోనూ రిజర్వేషన్లు ఎప్పుడో పూర్తయిపోయాయి. 
 
సగటున నాలుగైదు వందల వరకు.. కొన్నింట్లో దాదాపు వెయ్యి వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లను ద.మ.రైల్వే జారీచేసింది. ఆ పరిమితీ దాటిపోయింది. 
 
ఫలితంగా 10, 11, 12, 13 తేదీల్లో.. జన్మభూమి, కోణార్క్‌, సాయినగర్‌ షిర్డి-విశాఖ, ఈస్ట్‌కోస్ట్‌, ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీబ్‌రథ్‌, నర్సాపూర్‌ రైళ్లన్నీ టికెట్‌ తీసుకోలేని రిగ్రెట్‌ దశకు చేరాయి.
 
నిరీక్షణ తప్పదు. 
సింహపురి, శాతవాహన, గోల్కొండ, రాయలసీమ వంటి రైళ్లలో 150-200 వరకు నిరీక్షణ జాబితా ఉంది. శబరిలో 300పై మాటే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు