చంద్రబాబు కుట్రలకు నేను కూడా బాధితురాలినే: లక్ష్మీపార్వతి

మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:18 IST)
ప్రతిపక్షనేత చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నట్లు వైయస్ఆర్‌సిపి నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. 
 
తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ మేరకు తన విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అవినీతిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలని కోరారు. 
 
సీబీఐ విచారణను చంద్రబాబు స్వాగతించాలి..
చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ది వుంటే తనపై విచారణను స్వాగతించాలని డిమాండ్ చేశారు. ఆనాడు తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును పద్నాలుగేళ్ళ పాటు స్టేలతో అడ్డుకున్నాడని, సుప్రీంకోర్ట్ తీర్పు తరువాత ఆ కేసు మళ్లీ ఫోర్స్ లోకి వచ్చిందని అన్నారు. ఈ కేసుతో పాటు తాజాగా తాను రాసే లేఖపైన కూడా విచారణ జరపాలని కోరారు. 
 
చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్‌ను అవినీతిమయం చేసిన వైనంపై సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. పోలవరంను ఏటిఎంగా మార్చారన్న ప్రధాని, ఆ ప్రాజెక్ట్ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపించారని, ఇప్పుడైనా ఆ అవినీతిపైన విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధాని మీద వుందని అన్నారు. 
 
వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య..
అలాగే ఆనాడు ఎన్టీఆర్‌ను కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి అమరావతి అక్రమాల వరకు చంద్రబాబుపై తాను చేస్తున్న ఆరోపణలను న్యాయస్థానాలు సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఆఖరికి పత్రికలు, మీడియాను కూడా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న ఘనుడు అని విమర్శించారు.

చంద్రబాబుకు వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆనాడు  సైకిల్‌పై తిరిగే వేమూరి రాధాకృష్ణ ఒక ప్రతికాధిపతి ఎలా అయ్యాడని,  పచ్చళ్ళు అమ్ముకుని బతికిన రామోజీరావు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంభాలుగా వున్న వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు తన అక్రమాలకు  జైలుకు వెళితేనే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ అని అన్నారు. 
 
రాజకీయ ప్రయోజనాల కోసం.. సాగిలపడటం బాబు నైజం..
తాను సీఎంగా వున్న సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంపైనా కూడా చంద్రబాబు విమర్శలు చేశాడని, ఈ రోజు సమర్థ ప్రధాని అంటూ తన రాజకీయ అవసరాల కోసం సాగిల పడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అనేందుకు ఇది నిదర్శనమని అన్నారు.

చంద్రబాబు నీచ రాజకీయాలపై తమకంటే బిజెపి నేతలకే ఎక్కువ తెలుసునని అన్నారు. సీఎంగా వుండి ఆరోజు సిబిఐ, ఈడిలను ఈ రాష్ట్రంలోకి రానివ్వనని చంద్రబాబు మాట్లాడాడని, అదే చంద్రబాబు ఈరోజు అవే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపాలని సిగ్గులేకుండా అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న కుట్ర రాజకీయాలను గమనిస్తున్న ప్రజలు.. ఆయనను గ్రామాల్లో పిచ్చికుక్కను తరిమినట్లు తరిమే రోజు వస్తుందని మండిపడ్డారు. 
 
ఎవరి ఫోన్ ట్యాప్ జరిగిందో చెప్పు చంద్రబాబూ..
వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై చంద్రబాబు ఆధారం లేని ఆరోపణను చేస్తున్నాడని, ఎవరి ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందో ఆయన చెప్పగలడా అని శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ప్రధానికి లేఖ రాసే సందర్భంలో కనీస ఆధారాలను చూపాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని నిలదీశారు.

నిరాధారంగా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు ఎలా చేస్తారని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌పైనా, తనపైన కూడా ఇలాగే అనేక ఆరోపణలు చేశాడని, ఒక్కటి కూడా తరువాత నిరూపించలేక పోయాడని అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ గారి మీద కూడా ఇదే పద్దతిలో కుళ్ళు, కుట్రలతో ప్రధానికి లేఖలు రాస్తున్నాడని విమర్శించారు.
 
మోడీపై ఇప్పుడు గౌరవం ఎలా కలిగింది?
చంద్రబాబు డిక్షనరీలో సిద్దాంతం అనే పదమే వుండదని శ్రీమతి లక్ష్మీపార్వతి విమర్శించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక పార్టీ సహకారంతోనే ఎన్నికల్లో గెలిచాడే తప్ప, ఏనాడు సొంతగా పోటీ చేసి అధికారంను సాధించలేదని అన్నారు.

ఆనాడు నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా వున్న సమయంలో గోద్రా ఘటనపై ఆయనను పదవి నుంచి తప్పించాలని అప్పటి ప్రధాని వాజపేయ్‌కు చంద్రబాబు లేఖ రాసిన విషయం ఏమైందని నిలదీశారు. ఆ తరువాత బిజెపితో పొత్తు చారిత్రాత్మక తప్పిదం అంటూ మైనార్టీల ఓట్ల కోసం మొసలి కన్నీరు కార్చాడని, తిరిగి అదే బిజెపితో 2014లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు.

కనీసం అయిదేళ్ళు కూడా బిజెపితో వుండలేక ప్రధాని నరేంద్రమోదీపై లెక్కలేనన్ని ఆరోపణలు చేశాడని, వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డాడని అన్నారు. ఆఖరికి పీఎం రాష్ట్రంకు వస్తే, నల్లజెండాలు చూపించిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.

ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబుకు ఇదే ప్రధాని నరేంద్రమోదీ పై గౌరవం ఎలా కలిగిందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌పై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. ఆనాడు వద్దన్న సిబిఐ, ఈడిలు ఈరోజు ఎలా కావాలని కోరుతున్నాడో చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
 
పిచ్చిపట్టినట్లుగా బాబు వ్యవహరిస్తున్నాడు..
రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలతో ప్రజలు ఇచ్చిన స్థిరమైన తీర్పుతో శ్రీ వైయస్ జగన్ మంచి పరిపాలనను అందిస్తున్నారని, దీనిని చూసి తట్టుకోలేక చంద్రబాబు పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఏడాది కాలంలోనే ప్రజల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేసిన సీఎంగా జగన్ గారిని ప్రజలు కొనియాడుతుంటే చంద్రబాబు సహించలేక పోతున్నారని అన్నారు.

కులం, మతం, ప్రాంతం, ఆఖరికి పార్టీ వివక్షత కూడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి సంక్షేమాన్నీ ముఖ్యమంత్రి అందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేక రాష్ట్రం కరువు, కాటకాలతో, వలసలతో అల్లాడితే.. ఈరోజు వైయస్‌ జగన్ గారి హయాంలో కరువు ప్రాంతమైన రాయలసీమ సైతం మంచి వర్షాలతో, పచ్చని పంటలతో కళకళలాడుతోందని అన్నారు. 
 
బాబు కుట్రలకు ప్రత్యక్ష బాధితురాలిని..
దొడ్డిదోవన రాజకీయాల్లో అధికారం సంపాదించడానికి ఆరోజు ఎన్టీఆర్‌పై చేసిన కుట్రలు, వైశ్రాయ్‌ హోటల్‌ డ్రామాలు, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశాడో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఈ కుట్రల్లో తాను ప్రత్యక్ష బాధితురాలిని కాబట్టే చంద్రబాబు అరాచకాలను మరింత స్పష్టంగా చెప్పగలుగుతున్నానని అన్నారు.

ప్రజాస్వామ్యంలోని నాలుగు వ్యవస్థలను భ్రష్టుపట్టించడంలో చంద్రబాబు దిట్ట అని, ఈరోజు సీఎం శ్రీ వైయస్‌ జగన్ ప్రజల కోసం చేస్తన్న ప్రతి మంచి పనిని న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలనే కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. 
 
చంద్రబాబు కుట్రలకు కుడి, ఎడమలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంబంగా వున్న మీడియాను సైతం ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతిని తన కుడి, ఎడమలుగా పెట్టుకుని అక్రమాలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రతిరోజూ ఈ ప్రభుత్వంపై ఈ రెండు ప్రతికల్లో తప్పుడు కథనాలు రాయిస్తే, తన అబద్ధాలు, అసత్యాలతో కూడిన విమర్శలను ప్రచారం చేయించుకోవడంలో ఆరితేరిపోయాడని అన్నారు.

ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై తన అనుకూల మీడియా ద్వారా బురదజల్లించే కార్యక్రమం చేస్తున్నాడని విమర్శించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి లను కీలుబొమ్మలుగా మార్చి, తన ఇష్టం వచ్చిన అబద్దాలను వాటి ద్వారా చంద్రబాబు ప్రచారంలోకి తెస్తున్నాడని అన్నారు. 
 
తన కుట్రలకు తగిన ఫలితాన్ని ఇటీవల ఎన్నికల్లో చవిచూశాడని, తన పార్టీని, ఆఖరిని తన కుమారుడిని కూడా ప్రజలు ఘోరంగా ఓడించినా.. చంద్రబాబుకు ఇంకా బుద్ది రాలేదని అన్నారు. అధికారం చేతుల్లో వుంటే, నాకు ఎవరితోనూ సంబంధం లేదని అంటాడని, ఈ రోజు కేంద్రం కాళ్ళు పట్టుకుంటున్నాడని విమర్శించారు.

చంద్రబాబు నీచ వైఖరిని బిజెపి తిట్టిపోస్తున్నా సిగ్గూ, పౌరుషం లేకుండా వారి కాళ్ళ ముందు మోకరిల్లి తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని లక్ష్మీపార్వతి విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు