అవినీతి మంత్రిని జగన్ తన కేబినెట్ నుంచి తొలగించాల్సిందే: మాజీ మంత్రి ఫరూక్

గురువారం, 8 అక్టోబరు 2020 (09:39 IST)
మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతి, దోపిడీ గురించి అందరూ చూస్తూనేఉన్నారని, మంత్రిస్వగ్రామంలో పేకాట కేంద్రాలు నడుస్తున్నాయని, ఆయనకు తెలియకుండా, ఆ గ్రామంలో ఏదీ జరగదని, పేకాటాడేవారికి అక్కడ సకలవసతులు సమకూరుస్తున్నారని, జరుగుతున్న వ్యవహారంపై మంత్రి ఏం సమాధానం చెబుతాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ ఎమ్.డీ. ఫరూక్  నిలదీశారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మంత్రి హోదాలోఉన్న వ్యక్తి జూదాన్ని ప్రోత్సహించడం ఏమిటని, పేకాట ఆడేవారికి దగ్గరుండీ మరీ సకలసదుపాయాలు కల్పించడం ఏమిటని మాజీమంత్రి ప్రశ్నించారు. 2005-06లో రెండు, మూడు ఎకరాల భూమి మాత్రమే ఉన్న జయరామ్, నేడు కోట్లాదిరూపాయలు ఎలా సంపాదించాడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.

మంత్రిస్థాయిలో ఉన్నవ్యక్తి అవినీతి తారాస్థాయికి చేరినా, దానిపై టీడీపీ నిత్యం ప్రశ్నిస్తున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని ఫరూక్ ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడైన వ్యక్తి నుంచి, తనకుమారుడికి బెంజ్ కారు కానుకగా వచ్చిన విషయాన్ని టీడీపీనేత అయ్యన్నపాత్రుడు బయటపెట్టినా, దినపత్రికల్లో నిత్యం మంత్రి గారి అవినీతి బాగోతాలు బయటకు వస్తున్నా, జగన్ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

సహచరమంత్రి చేస్తున్న అవినీతి తనకేమీ తెలియదని జగన్ చెప్పినా ప్రజలెవరూ నమ్మరన్నారు. జయరామ్ ని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని ఫరూక్ తేల్చిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు