ఆక్సిజన్ నిల్వలు పుష్కలంగా ఉండేలా దృష్టిసారించాలి : నారా లోకేశ్

గురువారం, 22 ఏప్రియల్ 2021 (17:44 IST)
కరోనా రెండో దశ నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ముగ్గురుకు మించి వినియోగదారులు ఎక్కడా గుమికూడకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణాల్లో చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, టిఫిన్ బళ్ల నిర్వాహకులు వంటి వారిపై ఆర్థిక ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయాలు కల్పించాలన్నారు. 
 
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూసేందుకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను నియమించాలని నారా లోకేష్ లేఖలో వివరించారు. రక్తనిధి కేంద్రాల్లో తగినంత రక్తం నిల్వ ఉండేలా ఉద్యోగులు, ఇతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని కోరారు. రక్తదానం చేసే వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రిలో చేరే బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ ప్లాస్మా డోనర్ల డిమాండు పెరుగుతోందని.. కోవిడ్ రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 
 
అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్లాస్మా డోనర్ల సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలస కూలీల బాధలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నందున వారికి ఆకలి బాధ లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలను మూసివేసినా విద్యార్థులు పౌష్టికాహారం, శానిటరీ న్యాప్‌కిన్‌లను అందేలా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రోత్సహించాలని కోరారు. 
 
ఉపాధి హామీ పనుల డిమాండ్‌కు తగ్గట్టుగా కేంద్రానికి ప్రణాళికలు పంపి తగినన్ని నిధులు రాబట్టాలని చెప్పారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలన్నారు. టీకా వయస్సు పరిమితిని కేంద్రం సడలించేలా రాష్ట్ర ప్రభుత్వ చొరవ చూపాలని లేఖలో తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ ప్రమాణాలు పాటించటంతో పాటు వీలైనన్ని తక్కువ ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు