నమ్మి పంపిస్తే భార్య సహకారంతో గర్భవతిని చేశాడు... ఎక్కడ?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (11:58 IST)
అభంశుభం తెలియని చిన్నారిని తనకు తెలిసిన ఓ వ్యక్తితో పనికి పంపించారు ఆ యువతి తల్లిదండ్రులు. కానీ, కామంతో రగిలిపోతున్న ఆ కామాంధుడు.. ఆ చిన్నారిని కాటేశాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకుని ఆర్నెల్లుగా అత్యాచారం చేయసాగాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అరెస్టు చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంకు చెందిన ఓ కూలీ దంపతులు కొంతకాలంగా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నారు. వీరికి 15 యేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో తమ 15 ఏళ్ల కుమార్తెని కూడా ఏదైనా పనిలో పెట్టాలనుకున్నారు. తెలిసినవాళ్ల వద్ద అయితే బిడ్డ క్షేమంగా ఉంటుందని భావించారు. 
 
అంతే... సింగరాయకొండ మండలం బాలిరెడ్డినగర్‌లో నివాసముండే యుగంధర్ - నాగమణి దంపతుల వద్దకు ఇంటి పనికి చేర్చారు. ఈ దంపతులు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వెంట సోఫాలు, కుర్చీలు ఇతరత్రా ఫర్నీచర్ విక్రయించే వ్యాపారం చేస్తుంటారు. స్వగ్రామంలో వీరికి బాతు గుడ్ల వ్యాపారం కూడా ఉంది.
 
ఈ క్రమంలో ఈ బాలికతో కలిసి యుగంధర్ దంపతులు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి బాలికకు నరకం చూపించడం మొదలుపెట్టారు. దాదాపు 3 నెలలు బాలికను బెదిరింపులకు గురిచేసి యుగంధర్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొన్నిసార్లు మత్తు మందు ఇచ్చి కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఇందుకు భార్య నాగమణి కూడా సహకరించింది. 
 
ఇదేక్రమంలో ఈ ఏడాది మే నెలలో వారు బాలికను తీసుకుని బాలిరెడ్డినగర్‌లోని తమ స్వగృహానికి వచ్చారు. జులై 26న బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపించారు. బాలికను ఆమె ఇంటికి పంపించాక కూడా... పలుమార్లు తన వద్దకు పిలిపించుకుని యుగంధర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వారం రోజుల క్రితం బాలికను బైక్‌పై ఎక్కించుకుని పామూరు వెళ్లిన యుగంధర్... తిరుగు ప్రయాణంలో ఓచోట ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాలికను తిరిగి ఆమె ఇంటికి పంపించగా.... తల్లిదండ్రులు ఆమె శరీరంలో మార్పులను గమనించారు. అగస్టు 29న కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా... ఆమె ఐదు నెలల గర్భిణి అని తేలింది. బాలికను తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపెట్టింది.  దీంతో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు యుగంధర్‌, అతడి భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న దంపతుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు