వైఎస్సార్ జలకళ: ఈ పథకానికి అర్హులు ఎవరు, దీని వల్ల ప్రయోజనమా? ప్రమాదమా?

మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (13:46 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులకు ఉచితంగా బోరు బావులు వేయించేందుకు ‘వైఎస్సార్ జలకళ’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

 
ఈ పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని జగన్ అంటున్నారు. కానీ, రాష్ట్రంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న భూగర్భ జలాల పరిస్థితి ఈ పథకంతో మరింత దిగజారే అవకాశాలున్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ లేకుండా, ఉచితంగా బోర్లు వేయిస్తే భవిష్యత్తు ప్రమాదంలో పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 
ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది..
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1.62 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. అందులో 22.6 శాతం అటవీ ప్రాంతం కాగా, మరో 12.6 శాతం వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన భూమిలో నికరంగా వ్యవసాయానికి అందుబాటులో ఉన్న ప్రాంతం 60.48 లక్షల హెక్టార్లు. ఇది 37.1 శాతంగా ఉంది.

 
సాగుబడిలో ఉన్న భూమిలో కాలువల ద్వారా నీటి లభ్యత ఉన్న ప్రాంతం సుమారు 47 శాతం. 42.5 శాతం భూములకు బోరు బావులు ఆధారంగా ఉన్నాయి. మరో 7 శాతం భూములకు చెరువుల ద్వారా సాగునీరు లభిస్తోంది.

 
ఇప్పుడు వైఎస్ఆర్ జలకళ ద్వారా మరో 5 లక్షల ఎకరాలకు బోరు బావుల ద్వారా నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2 లక్షల బోర్లు ఉచితంగా వేయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2.5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. అంతకన్నా తక్కువ భూమి ఉన్న రైతులైతే, ఇద్దరు ముగ్గురు పోగై బోరు బావి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 
గ్రామ సచివాలయం ద్వారా ఈ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి, జియాలజిస్టు ఆమోదం లభించిన తర్వాత డ్వామా ఏపీడీ ద్వారా అనుమతిస్తారు. కాంట్రాక్టర్ ద్వారా బోర్ బావి తవ్విస్తారు. మొదటిసారి బోరులో నీరు పడకపోతే, రెండోసారి కూడా వేస్తారు. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత కాంట్రాక్టర్‌కి బోరుకు అయిన ఖర్చుని ప్రభుత్వం చెల్లిస్తుంది.

 
భూగర్భ జలాల పరిస్థితి ఏంటి?
ఏపీలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ పంపుసెట్లు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి 18.01 లక్షలున్నాయి. అవి గడిచిన పదేళ్లలో రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. అందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉండగా, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి.

 
చిత్తూరు జిల్లాలో సాగునీటి వనరులకు రైతులు అత్యధికంగా బోరు బావులపైనే ఆధారపడుతున్నారు. దీంతో భూగర్భ జలాల లభ్యత కూడా తక్కువగానే ఉంటోంది. భూగర్భ జలాల కోసం 20 మీటర్ల (65.6 అడుగుల)కు పైగా లోతుగా తవ్వాల్సిన ప్రాంతం అత్యధికంగా అనంతపురంలో ఉంది. ఆ తర్వాతి స్థానం చిత్తూరుది.

 
అనంతపురం జిల్లాలో 38.2 శాతం భూముల్లో బోరు వేయాలంటే 20 మీటర్లకుపైగా తవ్వాల్సి ఉంటుంది. చిత్తూరు జిల్లాలో 34.2 శాతం భూముల్లో అలాంటి పరిస్థితి ఉంది. దీంతో వందల అడుగుల లోతు వరకూ బోర్లు వేసి, నీరు పడక నష్టపోయిన రైతులు చాలా మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల బోరు వేసినప్పుడు నీరు పడినా, ఆ తర్వాత కొద్ది కాలానికే ఎండిపోతున్నాయి.

 
‘రైతుల సమస్యలు తీర్చడానికే’
నీటి లభ్యత లేక, బోరు బావుల కోసం అష్టకష్టాలు పడుతున్న రైతుల బాధలను పాదయాత్ర సందర్భంగా తాను అర్థం చేసుకున్నానని సీఎం జగన్ చెబుతున్నారు. అలాంటివారిని ఆదుకోవడానికే ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

 
"రైతులకు తోడుగా ఉంటానని ఆనాడే మాట ఇచ్చాను. 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాల్లో ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 163 బోరింగ్ యంత్రాలను ఏర్పాటు చేశాం. బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడేందుకు 2 లక్షల బోర్లు వేస్తాం. కేసింగ్ పైపులు కూడా అందిస్తాం. ఇందుకోసం రాబోయే నాలుగేళ్లలో రూ.2340 కోట్లను ఖర్చు చేయబోతున్నాం.

 
 చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడమే కాదు, మోటార్లు కూడా బిగించి ఇస్తాం. దీని కోసం అయ్యే మరో రూ.1600 కోట్ల ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శాస్త్రీయంగా సర్వే చేసిన తర్వాత అధికారులు బోరు ఎక్కడ వేయాలనేది నిర్ణయిస్తారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ లబ్ధిదారుల మోటార్లకు మీటర్లు బిగిస్తున్న విషయమై కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. రైతులకు ఎలాంటి నష్టమూ జరగకుండా, మరింత మెరుగ్గా విద్యుత్ సరఫరా చేయడం కోసమే మోటార్లకు మీటర్లు పెడుతున్నాం" అని వైఎస్సార్ జలకళ పథకం ప్రారంభం సందర్భంగా జగన్ అన్నారు.

 
ప్రాజెక్టులపై నిర్లక్ష్యం మూలంగానే...
ఏపీలో జలవనరులకు కొరత లేకపోయినప్పటికీ, వినియోగించుకునే విషయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లనే బోరు బావులపై రైతులు ఆధార పడాల్సి వస్తోందని నీటిపారుదల శాఖ రిటైర్డ్ చీఫ్‌ ఇంజనీర్ కె. నరసింహరావు అభిప్రాయపడ్డారు.

 
''వ్యవసాయానికి బోర్ల మీద ఆధారపడే పరిస్థితి మెట్ట ప్రాంతంలోనే ఉంటుంది. మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడమే. గాలేరు-నగరి వంటి పథకాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. కాలువల ద్వారా సాగు నీటి లభ్యత చిత్తూరు జిల్లాలో నామమాత్రం. బోర్ల ఆధారంగా పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలి. కానీ, తొలి ప్రాధాన్యత నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇవ్వాలి.

 
ప్రస్తుతం ఉచితంగా బోర్లు వేయడానికి ప్రభుత్వం రూ. 2340 కోట్లు వ్యయం చేస్తున్నట్లు ప్రకటించింది. దాని ద్వారా 5 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని చెబుతున్నారు. కానీ అదే డబ్బు హంద్రీ నీవా సహా ఇతర వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులపై వెచ్చిస్తే అంతకు మించి ప్రయోజనం లభిస్తుంది. బోర్లు తవ్విన తర్వాత ఉచితంగా విద్యుత్ అందించాలి. అది నిరంతరం చేయాల్సిన ఖర్చు. భవిష్యత్తులో ప్రభుత్వానికి భారం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

 
రెండేళ్లుగా ఫర్వాలేదంటున్న రైతులు
ప్రస్తుతం ఏపీలో నీటి లభ్యత పెరిగింది. వరుసగా రెండో ఏడాది కూడా వానలు బాగానే పడ్డాయి. రాష్ట్రంలో ఈ సీజన్‌లో సగటు కన్నా 27 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది.

 
ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటుగా చిన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. కృష్ణా, గోదావరి బేసిన్లతో పాటుగా పెన్నా నదీ బేసిన్‌లో కూడా ఈసారి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుండటంతో రాయలసీమ రైతుల ముఖాల్లోనూ ఆనందం కనిపిస్తోంది. అధిక వర్షాల కారణంగా చెరువులు నిండటంతో ఈసారి వ్యవసాయం సానుకూలంగా ఉందని వివిధ ప్రాంతాల రైతులు చెబుతున్నారు.

 
"గడచిన ఐదారేళ్లలో చూస్తే ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. రైతులకు నీటి లోటు లేదు. పంటలన్నీ బాగా కనిపిస్తున్నాయి. మేం పత్తి సాగు చేసేవాళ్లం. ఈసారి నీరు ఉండటంతో వరి కూడా వేశాం. బోర్ల ద్వారా కూడా నీరు బాగా వస్తోంది. ఇలాంటి పరిస్థితి గడిచిన పదేళ్లలో ఎన్నడూ చూడలేదు. కావాల్సిన వారందరికీ బోర్లు తవ్వితే రైతులకు మేలు జరుగుతుంది. అప్పులపాలు కాకుండా ఉంటాం" అని కడప జిల్లా మైదుకూరుకు చెందిన ఎం వెంకటప్ప అనే రైతు బీబీసీతో అన్నారు.

 
'దీర్ఘకాలంలో దుష్ర్పభావాలు'
బోరుబావుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం సరైన నిర్ణయం కాదని పర్యావరణ వేత్త పతంజలి శాస్త్రి అభిప్రాయపడ్డారు. ''ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా సంతృప్తిపరిచేందుకే. రైతులు ఆనందపడతారు. కానీ, పర్యావరణపరంగా శ్రేయస్కరం కాదు. భూగర్భ జలాల లభ్యత ఇటీవల కాలంలో తిరోగమనంలో ఉంది. గడిచిన రెండేళ్లలో కురుస్తున్న వర్షాలను మాత్రమే పరిగణలోకి తీసుకోలేం. 2016-17 సంవత్సరాలలో భూగర్భ జలాల లభ్యత వివిధ ప్రాంతాల్లో 5 నుంచి 10 శాతం వరకు తగ్గిపోవడం చూశాం. కోనసీమ లాంటి చోటే ఏకంగా 8 మండలాల్లో బోరు బావుల ఆధారంగా వ్యవసాయం చేయకూడదనే ఆంక్షలున్నాయి. అక్కడ భూగర్భ నీటి మట్టం వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

 
"భవిష్యుత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే బోరు బావుల ద్వారా వ్యవసాయం భారంగా మారుతుంది. నియంత్రణ లేకుండా బోర్లు వేయిస్తే, పథకం దుర్వినియోగం అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలి. ప్రత్యామ్నాయం ఆలోచించాలి. లేదంటే దీర్ఘకాలంలో దీని వల్ల దుష్ప్రభావాలను చూస్తాం" అని పతంజలి శాస్త్రి అభిప్రాయపడ్డారు.

 
'మరో మాయాజాలం'
వైఎస్ఆర్ జలకళ జగన్ చేస్తున్న మరో మాయాజాలమని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇది కొత్త పథకం కాదని... టీడీపీ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఎన్టీఆర్ జలసిరి పథకాన్నే పేరు మార్చి, మరోసారి ప్రజల ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు.

 
''మోటార్లకు మీటర్లు పెట్టి ఇప్పటికే రైతులకిచ్చే రూ.4వేల కోట్ల ఉచిత విద్యుత్ ఎగ్గొట్టే పన్నాగం వేశారు. ఇప్పుడు రూ. 2,340 కోట్లతో బోర్లు వేయిస్తామని మరో ద్రోహం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టి, ఉచిత బోర్లు అనడం రైతుల మూతికి చిక్కం కట్టడమే. బోర్లు ఉచితమనే పేరుతో, రైతులతో మోటార్లు, పంపుసెట్ల కొనుగోళ్లపై వేల కోట్ల ఖర్చు చేయించబోతున్నారు. కరెంటు బిల్లులు ఇప్పటికే మూడు నాలుగు రెట్లు పెంచేశారు. ప్రజలపై రూ రూ.4వేల కోట్ల భారం మోపారు. మీటర్ల కొనుగోళ్ల వ్యయం రూ.2 వేల కోట్ల భారాన్ని కూడా ప్రజలపైనే మోపారు'' అని రామకృష్ణుడు అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు