భారత్‌లో లక్ష దాటిన కరోనా కేసులు - ఆంధ్రా - తెలంగాణాల్లో... (video)

మంగళవారం, 19 మే 2020 (08:45 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది. అలాగే మృతుల సంఖ్య మూడువేలకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన గణాంకాల మేరకు సోమవారం నాటికి వైరస్‌ కేసుల సంఖ్య 1,00,096కు చేరిందని, మరణాల సంఖ్య 3,078గా ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
 
కానీ, కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం వెల్లడించిన గణాంకాల ప్రకారం మాత్రం కేసుల సంఖ్య 96,169. మృతుల సంఖ్య 3,029. కానీ, రాష్ట్రప్రభుత్వాలు తెలిపిన లెక్కలను అనుసరించి సోమవారం రాత్రి పీటీఐ వార్తాసంస్థ.. దేశంలో కేసుల సంఖ్య లక్ష దాటిందని ప్రకటించింది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ 11 స్థానంలో ఉన్నది. 
 
మరోవైపు, దేశవ్యాప్తంగా ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు రికార్డు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 24 గంటల్లో 157 మంది మరణించారు. కోలుకున్నవారి శాతం 38.29గా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
తెలంగాణాలో కొత్తగా 41 కేసులు 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1592కు చేరాయి. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో 26 మంది చనిపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 34 మరణాలు సంభవించాయి. 
 
ఏపీలో 52 మందికి నిర్ధారణ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనాకు అడ్డుకట్ట పడడం లేదు. పరీక్షలు చేస్తున్న కొద్దీ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 9,713 శాంపిళ్లను పరీక్షించగా మరో 52 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,282 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 705 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,527 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 15, తూర్పుగోదావరిలో 5, కడపలో 2, కృష్ణాలో 15, కర్నూలులో 4, నెల్లూరులో 7, విశాఖపట్నంలో 1, విజయనగరంలో 1, పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కర్నూలులో మొత్తం కేసులు 615కు చేరాయి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు