గబ్బిలాలే కాదు.. వాటిద్వారా కూడా నిపా వైరస్ వ్యాప్తి!

శనివారం, 26 మే 2018 (13:47 IST)
కేరళ రాష్ట్రాన్ని వణికిస్తున్న నిపా వైరస్ కేవలం గబ్బిలాల ద్వారానే వ్యాపించడం లేదనీ వైద్యులు తేల్చారు. ఈ వైరస్ పందులు, కోతులు, పిల్లుల నుంచి కూడా వ్యాపిస్తుందని వైద్యుల పరిశోధనలో తేల్చారు. 
 
కాగా, ఈ వైరస్ ధాటికి కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాలలోని 12 మంది మరణించారు. అయితే, కేరళలో వ్యాప్తి చెందుతున్న నిపా వైరస్‌కు సంబంధించి విడుదలైన రిపోర్టు‌లో ఈ వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే ప్రధాన కారణం కాదని వెల్లడైంది.
 
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల ల్యాబ్‌కు ఈ గబ్బిలాల శాంపిల్స్‌ను పంపారు. వాటిని నిపుణులు పరిశీంచగా వాటికి నిపా వైరస్ ఉందని స్పష్టం కాలేదు. పశువైద్యశాఖ పరీక్షల కోసం మొత్తం 21 శాంపిల్స్ పంపింది. అయితే వీటిలో వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని నిపుణులు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఈ వైరస్ సోకుతుందనీ ప్రజలు తమ ఆవాసాలను విడిచి పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 
 
ముఖ్యంగా, తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ, ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం ద్వారా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 
 
నిపా వైరస్ అన్నది జూనోటిక్ వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అలాగే, ఇది సోకిన వారి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది. మొదటగా మలేషియాలో పందుల పెంపకందార్లలో బయటపడింది. 
 
ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన వారిలో శ్వాసకోస ఇన్ఫెక్షన్, జ్వరం, వళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు