హువావేపై అమెరికా ఆంక్షలు... 5జీ నెట్‌వర్క్‌తో భద్రతను ప్రమాదంలో

గురువారం, 21 మే 2020 (16:59 IST)
5G network
మొబైల్‌ ఫోన్ల నెట్‌వర్క్‌లో నూతన విప్లవంగా భావిస్తున్న 5జీ నెట్‌వర్క్‌ టెక్నాలజీని అందించేందుకు హువావే వివిధ దేశాలతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హువావే టెక్నాలజీ కారణంగా దేశ భద్రత పరంగా ముప్పు కలిగించేలా ఉందంటూ హువావేపై అమెరికా ఆంక్షలు విధించగా... రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో గతేడాది జూన్‌లో హువావే ఒప్పందం కుదుర్చుకుంది. 
 
తాజాగా జాతీయ భద్రత, 5జీ నెట్‌వర్క్ సమగ్రత రక్షణ అంశంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. వాణిజ్య విభాగ విదేశీ ప్రత్యక్ష ఉత్పత్తుల వినియోగం నిబంధనలు మరింత విస్తృతం చేసింది. తద్వారా చైనీస్‌ టెలికం దిగ్గజం హువావే టెక్నాలజీస్‌ను అమెరికా చట్టాలను ఉల్లంఘించకుండా కట్టడి చేయనుంది. 
 
అమెరికా పౌరుల గోప్యత, ప్రపంచవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ వినియోగదారుల భద్రతను ప్రమాదంలో పడేసేందుకు చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న ప్రయత్నాలను తాము సహించబోమని హెచ్చరించింది.
 
అమెరికాలో హువావే గూఢచర్యం చేస్తోందని ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఆ సంస్థపై నేరారోపణలు చేసింది. అదే విధంగా ఇరాన్‌తో అనుమానాస్పద ఒప్పందాలు కుదుర్చుకుని.. ఆ దేశానికి సహకరిస్తోందని ఆరోపించింది. దీంతోపాటు అమెరికా ఆంక్షలు విధించింది. 
 
ఇక తాజా నిబంధనల నేపథ్యంలో అమెరికా సాంకేతికతను హువావే దుర్వినియోగం చేసే వీలు లేకుండా పోయిందని.. తద్వారా తమ జాతీయ భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లబోదని పేర్కొంది. అంతేగాక అమెరికా టెక్నాలజీ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హువావే కోసం సెమీకండక్టర్లను తయారు చేసే దేశాలపై సాంకేతికపరంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. 
 
ఇక నుంచి తమ టెక్నాలజీని ఉపయోగించి డిజైన్‌ చేసే వస్తువులను హువావేకు అమ్మాలనుకుంటే లైసెన్స్‌ తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. జాతీయ భద్రత, అంతర్జాతీయ సుస్థిరతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు హువావేకు ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు