275 చైనా యాప్‌లపై నిషేధం.. టిక్‌టాక్ బాటలో పబ్‌జీ..?

సోమవారం, 27 జులై 2020 (13:52 IST)
భారత్ ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అందులో టిక్‌టాక్ వంటి ప్రముఖ యాప్‌లు ఉన్నాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం కారణంగా చైనా యాప్‌లు నిషేధానికి గురవుతున్న సంగతి తెలిసిందే. 
 
అయితే ఇవే కాదు.. మరో 275 వరకు యాప్‌లను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నిషేధించనున్నట్లు తెలుస్తోంది. ఆ యాప్‌లు చైనాకు చెందినవి కాకపోయినా.. చైనాతో పరోక్ష సంబంధాలు ఉన్నాయి. దీంతో వాటి వివరాలను ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 
 
వాటిలో ప్రముఖ మొబైల్ గేమింగ్ యాప్ పబ్‌జి మొబైల్ కూడా ఉంది. ఈ యాప్ నిజానికి దక్షిణ కొరియాకు చెందినది. అయినప్పటికీ దీన్ని మొబైల్ ప్లాట్‌ఫాంపై తెచ్చేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ పబ్లిషింగ్ కంపెనీ సహాయం చేసింది. ఆ కంపెనీ కూడా పబ్‌జి మొబైల్‌లో భాగంగా ఉంది. ఈ క్రమంలో పబ్‌జి మొబైల్ గేమ్‌కు సంబంధించి చైనా సర్వర్లలో యూజర్ల డేటాను స్టోర్ చేసి ఉంటారేమోనని ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. 
 
అలాగే మొత్తం 280 ఇతర యాప్‌ల డేటా వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా యాప్‌లు తమ యూజర్ల డేటాను చైనా సర్వర్లలో గనక స్టోర్ చేస్తుంటే వాటిపై నిషేధం విధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న పాకిస్థాన్ కూడా టిక్ టాక్‌పై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పబ్ జీపై పాక్‌లోనూ నిషేధం కొనసాగుతోంది. ఇదే తరహాలో భారత్‌లోనూ నిషేధం విధించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు