అ'మూల్యం' చెల్లించాల్సిందే.. కర్నాటక సీఎం యడ్యూరప్ప

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (16:40 IST)
బెంగళూరులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్న సీఏఏ వ్యతిరేక సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ అంశంపై కర్ణాటక సీఎం యడియూరప్ప స్పందించారు. అమూల్య లియోన్‌కు గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయని, ఆమెకు బెయిల్ లభించే అవకాశాలు దాదాపు లేనట్టేనని స్పష్టంచేశారు. అమూల్య వెనుక ఉన్న సంస్థలు ఏమిటో దర్యాప్తుతో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంస్థలకు అడ్డుకట్టపడదని యడియూరప్ప అభిప్రాయపడ్డారు.
 
మరోవైపు, తన కుమార్తె వ్యవహారంపై ఆమె తండ్రి స్పందించారు. తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురిలో ఎలాంటి మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆమెను జైల్లోంచి తీసుకురావడానికి తానే న్యాయవాదులను సంప్రదించబోనని స్పష్టం చేశారు. కాగా, ఆమెకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం, 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు