తుఫానుగా మారిన బురేవి... 4న తీరం తాకుతుందట... కేరళలో రెడ్‌అలెర్ట్

బుధవారం, 2 డిశెంబరు 2020 (13:41 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా మారింది. ఇపుడు తుఫానుగా అవతరించింది. దీనికి బురేవి అని నామకరణం చేయగా, ఇది ఈ నెల 4వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారిలో తీరందాటుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై వాతావరణ శాఖ అధికారులు స్పందిస్తూ, కేరళలోని తిరువనంతపురం జిల్లాపై దీని ప్రభావం అధికమని, 5వ తేదీ వరకూ కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన కేరళ సర్కారు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ తుఫాను శ్రీలంకపైనా పెను ప్రభావాన్ని చూపుతుందని అధికారులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఇది ట్రింకోమలీకి 330 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించిన అధికారులు, నేడు శ్రీలంకలో అతి భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. గురువారం నాటికి ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మొత్తం విస్తరిస్తుందని, ఆపై భారత్ దిశగా సాగి, తమిళనాడు, కేరళపై విరుచుకుపడుతుందని తెలియజేశారు. 
 
బురేవీ ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే తూత్తుకుడి ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. 
 
తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తుఫాను తీరం దాటేసమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

 

Cyclone Storm "Burevi" lay centered about 330 km Esat-Southeast of https://t.co/grfj6Lbre3 cross Sri Lanka coast close to Trincomalee on 2 Dec. evening/night. To emerge into Gulf of Mannar on 3rd Dec. morning & cross south TN between Kanniyakumari and Pamban on 4th early morning. pic.twitter.com/COgcW1R0AD

— India Meteorological Department (@Indiametdept) December 1, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు