స‌ర్వ‌భూపాల వాహనంపై సర్వాంతర్యామి

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:18 IST)
శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు స‌ర్వ‌భూపాల వాహ‌నంలో దర్శనమిచ్చారు. స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వానికి బ‌దులుగా స‌ర్వ‌భూపాల వాహ‌న‌సేవ జ‌రిగింది.
 
సర్వభూపాల వాహ‌నం - య‌శోప్రాప్తి
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతిరెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు