సప్త వ్యసనాలు అంటే ఏమిటి?

గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:13 IST)
ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే..
 
1. పరస్త్రీ వ్యామోహం : 
ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వకాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.
 
2. జూదం : 
ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)
 
3. మద్యపానం : 
పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. 
(పురాతన కథలు అందరికీ వివరంగా తెలియకపోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.
 
4. వేట : 
పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీరామచంద్రుడికి దూరమై రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు ! (ఇదివరకంటే కృరమృగాల బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది, స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).
 
5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం : 
దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు.. ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని..!)
 
6. కఠినంగా దండించటం :
దీనికి కూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).
 
7. ఆఖరిది డబ్బు :
కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి! 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు