జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనం.. తలనీలాలు, పుణ్యస్నానాల్లేవు..

శుక్రవారం, 5 జూన్ 2020 (14:16 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనం జరుగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రాక కోసం ఏర్పాట్లను పూర్తి చేసింది. దీనికి సంబంధించిన నిబంధనలను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కోసం అనుమతి ఇస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ముందుగా సిబ్బందితో ట్రయల్ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తామని చెప్పారు.
 
ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం అవకాశం ఉంటుంది. 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఎవరూ దర్శనానికి రాకూడదని సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులు ధరించాలన్నారు. 
 
ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 3 వేల మందికి, నేరుగా వచ్చిన వారిలో 3 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామని తెలిపారు. నేరుగా వచ్చే వారు అలిపిరి వద్ద రిజిస్టేషన్ చేయించుకోవాలని చెప్పారు. అలిపి నుంచే కాలినడకన అనుమతి ఉంటుందని చెప్పారు. శ్రీవారి నడక మార్గంలో రావద్దని పేర్కొన్నారు. మరోవైపు తలనీలాలు సమర్పించడం, పుణ్యస్నానాలు ఆచరించే వీలు లేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు