హైదరాబాద్ నగరంలో జూలై 3 నుంచి సంపూర్ణ లాక్డౌన్

మంగళవారం, 30 జూన్ 2020 (15:43 IST)
హైదరాబాద్ నగరంలో జూలై మూడో తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఇదే అంశంపై సీఎం కేసీఆర్ ఆధ్యక్షతన బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే జులై 3వ తేదీ నుంచి 15 రోజులపాటు హైదరాబాద్‌లో లాక్డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతి తెలిపినట్లుగా సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా, జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. వ్యాధి వ్యాప్తి నిరోధానికి అధికారులు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. 
 
మరోవైపు 24 గంటలపాటు ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సరోజిని కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయం, ఆయుర్వేదిక్‌, ఛార్మినార్‌ నిజామియా ఆస్పత్రుల్లో రోగుల నుంచి స్వాబ్‌ శాంపిల్స్‌ను సేకరించి కరోనా పరీక్షల నిర్వహించనుంది. 
 
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్‌ విధింపే సరైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు. జాగ్రత్త చర్యలు పాటించడంలో ప్రజలు విఫలమయ్యారని ప్రభుత్వానికి సమర్పించిన వివిధ నివేదికలు సూచిస్తున్నాయి. 
 
స్వీయ క్రమశిక్షణ ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవన్నారు. క్రితంసారి విధించిన లాక్‌డౌన్‌కు భిన్నంగా ఈసారి విధించబోయే లాక్డౌన్‌ ఉండనున్నట్లు సమాచారం. నిత్యావసర సరుకుల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా మిగతా అన్ని దుకాణాలను మూసివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 
 
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధింపు. వైన్స్‌ షాప్స్‌ బంద్‌ కానున్నాయి. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలను తెరిచిఉంచే విషయమై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఐటీ కార్యాలయాలు ఇప్పటికే 50 శాతం ఉద్యోగులతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నూతన మార్గదర్శకాల ప్రకారం ఈసారి లాక్డౌన్‌ నియమాలు కఠినంగా ఉండనున్నట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు