తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య.. నిజామాబాద్‌లోనే అధికం

శనివారం, 16 జనవరి 2021 (12:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో 2,82,497 మంది నూతన ఓటర్లు నమోదవడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,01,65,569 మందికి చేరింది. ప్రతి యేటా ఓటర్ల జాబితా సవరణ తరవాత జనవరి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ శుక్రవారం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గడిచిన ఏడాది 3,00,55,327 మంది ఓటర్లు ఉన్నారు. 
 
తాజాగా 2,82,497 మంది అదనంగా ఓటు హక్కు పొందగా, 1,72,255 మంది ఓట్లు తొలగించారు. దీన్నిబట్టి గడిచిన ఏడాదితో పోలిస్తే 1,10,242 మంది ఓటర్లు పెరిగినట్లయింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 
 
నిజామాబాద్‌ జిల్లాలో పురుషులతో పోలిస్తే అత్యధికంగా 68,628 మంది మహిళా ఓటర్లు ఉండగా, అతి తక్కువగా జనగాం జిల్లాలో 750 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 18-39 ఏళ్ల మధ్య యువ ఓటర్లు సుమారు కోటీ యాభై రెండు లక్షల మంది(సుమారు 50 శాతం) ఉండటం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు