నర్సును కారులో కిడ్నాప్, లాడ్జిలోకి తీసుకెళ్లి నిర్బంధించి...

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:45 IST)
నర్సును కారులో కిడ్నాప్ చేసిన ముగ్గురు కిడ్నాపర్లు శంషాబాద్ లాడ్జిలో నిర్భంధించి ఆ నర్సును చిత్ర హింసలు పెట్టారు. అప్పటికే లాడ్జిలో ఉన్న మరో ఏడుగురితో కలిసి కిడ్నాపర్లు నర్సును తాకరాని చోట్ల తాకుతూ.. దాడి చేస్తూ... పైశాచికానందం పొందారు.
 
యువతి నుంచి రూ.55 లక్షలు తీసుకుని మోసగించాడు ఆవుల రాజేష్. పూర్తి వివరాలు చూస్తే.. ఆమె పేరు రంగమ్మ. నల్గొండ జిల్లా నారాయణపురం గ్రామంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంటుంది. భర్త ల్యాబ్ టెక్నీషియన్‌గా చేస్తుండేవాడు. 
 
హైదరాబాద్ రాయదుర్గం మణికొండ ప్రాంతంలో ఉండే ఆవుల రాజేష్ వందల కోట్ల వ్యాపారం చేస్తుంటాడని.. ప్రస్తుతం ఆవుల రాజేష్‌కు కొంత డబ్బు అవసరముందంటూ కొందరు వ్యక్తులు మూడు నెలల క్రితం వచ్చి నర్సు రంగమ్మను కలిశారు.
 
రూ. 55 లక్షలు అప్పుగా ఇస్తే వారం పది రోజుల్లో రెట్టింపు డబ్బులు ఇస్తానని రంగమ్మను నమ్మించాడు ఆవుల రాజేష్. అంతగా నమ్మకం లేకుంటే... వనపర్తిలోని ఏడు ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తానని.. డబ్బుకు రెట్టింపు ఇస్తానని చెక్కులు ఇచ్చాడు. కానీ పత్రాల్లో మాత్రం నెల రోజుల్లో బాకీ డబ్బు తిరిగి ఇస్తానని రాసిచ్చాడు. కానీ బాకీ డబ్బు గురించి అడిగితే వనపర్తిలో ఇస్తానని చెప్పిన ఏడు ప్లాట్లకు బదులు రెండు ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేశాడని బాధితురాలు వాపోయింది. 
 
తన అప్పు తీర్చాలని నిలదీస్తున్న బాధిత మహిళ రంగమ్మ ఇంటికి కారులో వచ్చిన సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్ రెడ్డిలు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నర్సు రంగమ్మను శంషాబాద్ లోని ఓ లాడ్జిలో నిర్బంధించారు. అప్పటికే అక్కడి లాడ్జిలో ఉన్న మరో ఏడుగురు కూడా కలిసి.. బాధితురాలుని తాకరాని చోట్ల తాకుతూ పైశాచికానందం పొందారు. శారీరరంగా, మానసికంగా క్రూరంగా హింసలకు గురిచేశారు.
 
కత్తులతో బెదిరింపులకు పాల్పడ్డారు. బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని కన్నీరుమున్నీరవుతోంది బాధిత మహిళ. బాకీ తీర్చాలని వనపర్తిలోని ఆవుల రాజేష్ ఇంటికి వెళ్లి అడగగా.. అక్కడ తన జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారని రోదించింది. తనలా ఇంకొందరు మహిళలను కూడా ఇలానే మోసం చేసి ఉంటాడని.. భర్తలకు తెలిస్తే కాపురాలు కూలుతాయని బయటకు చెప్పుకోలేక ఊరుకుంటున్నారని చెప్పింది ఆ బాధితురాలు.

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 406, 365, 354, 342, 323, 504, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కిడ్నాప్‌కు పాల్పడ్డ నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు