అప్పుల పాలైన తల్లికి సాయం చేసేందుకు అత్తారింటికే కన్నం వేసిన కోడలు.. ఎక్కడ?

శుక్రవారం, 27 నవంబరు 2020 (14:04 IST)
అప్పుల పాలైన తల్లికి సాయం చేసేందుకు అత్తారింటికే ఆ కోడలు కన్నం వేసింది. ఈ వ్యవహారం పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యాప్రాల్ కింది బస్తీకి చెందిన ఓ కుటుంబం ఈ నెలలో బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరిగి వచ్చేసరికి ఇంట్లోని స్టోర్ రూంలో సామగ్రి కిందపడేసి ఉండడంతో పాటు అల్మారా పగులగొట్టి ఉంది. 
 
44 తులాల బంగారం, వెండితో పాటు పదివేల వరకు నగదుకు ఎత్తుకు వెళ్లారు. వెంటనే స్థానిక జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించగా.. సీసీఎల్‌ మల్కాజ్‌గిరి, ఐటీసెల్‌ పోలీసులతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇందులో ఒంటినిండా నల్లటి దుస్తులు కప్పుకొని వచ్చిన వ్యక్తిని గుర్తించారు. సదరు వ్యక్తిపై అనుమానం వచ్చి మరిన్ని సీసీటీవీల ఫుటేజీలను పరిశీలించగా.. దొంగతనం చేసింది ఆడ వ్యక్తిగా తేల్చారు. 
 
ఈ మేరకు విచారణ జరపగా.. ఇంటి యజమాని కోడలే తన తల్లితో కలిసి దొంగతనం చేసినట్లు తెలిసింది. ఇంటికి పెద్ద కోడలైన సోని, తల్లి లీలావతి మాటలు విని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సోని 2016లో ఇంటి యజమాని కొడుకు విశ్వనాథ్‌ను లవ్‌ మ్యారేజ్‌ చేసుకుందని చెప్పారు. నిందితులు ఇద్దరి నుంచి 44 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.10,500 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులు వాసగోని సోని, నేమూరి లీలావతిపై కేసు నమోదు చేసినట్లు సీసీ వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు