సముద్ర గస్తీ కోసం మహిళా పైలెట్లు... డోర్నియర్ విమానంతో విధులు

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:50 IST)
భారత నౌకాదళంలో నవశకం మొదలైంది. సముద్ర జలాలపై నిఘా వేసి భారత నేవీకి సేవలందించేందుకు తొలిసారిగా మహిళా పైలట్ల బృందం సిద్ధమైంది. లెఫ్టినెంట్‌ దివ్య శర్మ, లెఫ్టినెంట్‌ శుభాంగి స్వరూప్‌, లెఫ్టినెంట్‌ శివాంగి అనే ముగ్గురు పైలట్లు సదరన్‌ నేవల్‌ కమాండ్‌(ఎస్ఎన్‌సీ)లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ వెల్లడించింది. 
 
"27వ డోర్నియర్‌ విమాన శిక్షణ(డీఓఎఫ్‌టీ) కోర్సులో ఈ ముగ్గురు యువతులు శిక్షణ పొందారు. కొచ్చిలోని ఐఎన్‌ఎస్ గరుడలో గురువారం నిర్వహించిన పాసింగ్‌ ఔట్‌ వేడుకలో తమ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్నారు. నేవీకి సంబంధించిన అన్ని అపరేషన్‌ మిషన్లలోనూ డోర్నియర్‌ విమానాన్ని నడిపేందుకు వీరికి పూర్తి సామర్థ్యం ఉంది" అని రక్షణ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
దివ్య శర్మ స్వస్థలం న్యూఢిల్లీలోని మాలవీయనగర్‌ కాగా.. శుభాంగి స్వరూప్‌ ఉత్తర ప్రదేశ్‌లో తిల్‌హార్‌కు, శివాంగి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వారని తెలుస్తోంది. తొలుత వాయుసేన వీరికి పాక్షిక శిక్షణ ఇవ్వగా.. అనంతరం నేవీలోని డీఓఎఫ్‌టీ కోర్సులో చేరి తమ శిక్షణను పూర్తి చేసుకున్నారని ప్రతినిధి పేర్కొన్నారు.
 
కాగా, స‌ముద్రంపై గ‌స్తీ కోసం అర్హ‌త సాధించిన ముగ్గురు మ‌హిళా పైల‌ట్లు లెఫ్టినెంట్ దివ్య శ‌ర్మ‌, లెఫ్టినెంట్ శుభాంగి, లెఫ్టినెంట్ శివాంగికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ముగ్గురిని మిగ‌తా మ‌హిళ‌లు ఆద‌ర్శంగా తీసుకుని ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ఆమె ఆకాంక్షించారు. ఈ ముగ్గురు డోర్నియ‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో స‌ముద్రంపై గ‌స్తీ నిర్వ‌హించేందుకు సిద్ధం కావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
కాగా, సముద్రంపై డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో గస్తీ నిర్వహించడానికి అర్హత సాధించిన మొట్టమొదటి మహిళల బ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. 27వ డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌(డీవోఎఫ్‌టీ) కోర్సులో భాగంగా వీరు శిక్షణ పొందారు. గురువారం ఐఎన్‌ఎస్‌ గరుడలో ఈ ముగ్గురికి పట్టా ప్రదానోత్సవం జరిగింది. 
 
ఈ ముగ్గురు మొదట ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్లుగా శిక్షణ పొందారు. తర్వాత శివాంగి మొదటిసారిగా నౌకాదళ పైలట్‌గా 2019 డిసెంబర్‌ 2న అర్హత సాధించారు. 15 రోజుల తర్వాత మిగతా ఇద్దరు కూడా అర్హత సాధించారు. తర్వాత వీరంతా ఒక బృందంగా ఏర్పడి డీవోఎఫ్‌టీ కోర్సులో చేరారు. దివ్య శర్మ ఢిల్లీ, శుభాంగి యూపీ, శివాంగి బీహార్‌కు చెందినవారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు