అలోక్ నాథ్ రూ.1 పరువునష్టం దావా.. అక్బర్ పిటిషన్ దాఖలు.. మీ టూ ఏమౌతుందో?

సోమవారం, 15 అక్టోబరు 2018 (17:57 IST)
ప్రపంచ వ్యాప్తంగా మీ టూ ప్రకంపనలు కొనసాగుతున్న వేళ.. ఈ ఉద్యమానికి బ్రేక్ పడేలా కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ గతంలో జర్నలిస్టుగా పనిచేసిన సమయంలో తనను వేధించాడని మహిళా జర్నలిస్ట్ ప్రియా రమణి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియా రమణిపై అక్బర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎంజే అక్బర్ న్యాయవాది కరంజవాలా పటియాలా హౌస్ కోర్టులో సోమవారం మంత్రి తరఫున పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధించాడన్న ప్రియా రమణి, సదరు వ్యక్తి ఎంజే అక్బర్ అని బయటపెట్టి సంచలనం సృష్టించారు. దీంతో మరో 10 మంది మహిళా జర్నలిస్టులు తాము కూడా అక్బర్ చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపించారు. అక్బర్ తనపై వచ్చిన అభియోగాలను ఖండించారు. 
 
రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారనీ, తనపై తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రియా రమణిపై పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజకీయ నేతలు ఎంతటి సాహసానికైనా దిగుతారని.. అందులో భాగమే ఈ పిటిషన్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
మరోవైపు బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ పై రచయిత్రి, నిర్మాత వింతా నందా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై రూపాయి పరువునష్టం దావా వేశారు అలోక్ నాథ్. తన భార్య అశునాథ్‌తో కలసి వేసిన కేసులో... రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ. 1 పరిహారంగా చెల్లించాలని అడిగారు.
 
19 ఏళ్ల క్రితం తనపై అలోక్ నాథ్ అత్యాచారం చేశారని వింతా నందా ఆరోపణలు చేశారు. ఈమె తర్వాత సంధ్య మృదుల్, దీపిక అమీన్ అనే మహిళలు కూడా అతనిపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సినీ రంగంతో పాటు మీడియా, రాజకీయ రంగాల్లో మీ టూ ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
 
బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, డైరెక్టర్లు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, మాజీ జర్నలిస్టు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను లైంగికంగా వేధించారని ఇటీవల పలువురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు