వైఎస్సార్సిపి చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. మహానాడులో కేవలం వైఎస్సార్సీపిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారనీ, అబద్ధాలు, మోసాల్లో చంద్రబాబు నాయుడుకి తుప్పు బిరుదు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. ఇక ఎప్పటిలాగానే ఆయన కుమారుడు నారా లోకేష్ పప్పు బిరుదుని సొంతం చేసుకున్నారని అన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపి ఘన విజయం సాధిస్తుందనీ, ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో వున్నారని చెప్పుకొచ్చారు.
మరోవైపు నిన్న దేశంలో వెలువడిన నాలుగు ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. భాజపా వ్యవహార శైలి చూస్తుంటే, నటుడు శివాజీ చెప్పినట్లే ఆపరేషన్ గరుడ ప్లాన్ చేసిందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డితో లాలూచీ రాజకీయాలు చేస్తూ, ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇవే కాకుండా ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు, రమణ దీక్షితులతో ఆరోపణలు వంటివన్నీ చూస్తే ఆపరేషన్ గరుడ నిజమేనన్న భావన కలుగుతోందన్నారు. ఐతే భాజపా ఆపరేషన్లు రివర్సవుతున్నాయనీ, అవన్నీ వాళ్లకే తగులుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. కర్నాటకలో ప్రారంభమైన భాజపా పతనం 2019 నాటికి పూర్తిగా ముగుస్తుందని జోస్యం చెప్పారు.