నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు సినిమా, సామాజిక, రాజకీయ రంగాల్లో అడుగడుగునా తన పాద ముద్ర లిఖించిన చిత్రసీమ అంబేద్కరుడు దాసరి నారాయణ రావు కోట్లాది తెలుగు ప్రజానీకాన్ని, అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తుతూ జీవితం చాలించారు. 151 సినిమాలకు దర్శకత్వం.. నిర్మాతగా 53 సినిమాలు, రచయితగా 250 చిత్రాలు.. కేంద్రమంత్రిగా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర, చిత్రసీమ, రాజకీయ రంగం, సామాజిక రంగం ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా సంస్కరణను జపించిన, అమలు చేసిన తెలుగు చిత్రసీమ మేరునగ శిఖరం కన్నుమూసింది.
కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్లిన దాసరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తోల్‌కట్ట వద్ద ఉన్న దాసరి ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నాలుగేళ్ల క్రితం ఆయన భార్య దాసరి పద్మ అంత్యక్రియలు కూడా ఇదే ఫాంహౌస్‌లో నిర్వహించారు. దాసరి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, సినీరంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
దాసరి నివాసానికి ఎదురుగా ఉన్న మస్తాన్‌నగర్ వాసులకు గత రెండు దశాబ్దాలుగా ఆయన సుపరిచితులు. దాసరి మరణ వార్త విని స్థానికులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దాసరి కొడుకు అరుణ్‌కుమార్ నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నం.72లోనూ విషాదం నెలకొంది. ఎక్కడ చూసినా దాసరి లేరన్న వార్తను తట్టుకోలేక విలపిస్తున్న కుటుంబీకులు, బంధు మిత్రులు కనిపించారు.