జిడ్డు చర్మం పోవాలంటే ఏం చేయాలి?

శుక్రవారం, 8 జనవరి 2016 (11:43 IST)
ఆడవాళ్లలో చాలామంది ఆయిల్‌‌స్కిన్‌ సమస్యతో బాధపడుతుంటారు. ఫేస్‌వాష్‌ చేసుకున్న కాసేపటికే జిడ్డుగా మారుతుంటుంది. అయితే వీరు ఇంట్లోనే తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌లను వాడటం వల్ల ఈ సమస్య నుంచి కొంచెం బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు.
 
మొటిమలు, మచ్చలను తొలగించడంలో రెడ్‌ శాండల్‌వుడ్‌ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మం నిగారింపు సంతరించుకోవడానికి ఉపకరిస్తుంది. రోజ్‌వాటర్‌తో కలిపి రెడ్‌ శాండల్‌వుడ్‌ను అప్లై చేసుకోవడం వల్ల అదనపు ఆయిల్‌, జిడ్డు వంటివి తొలగిపోతాయి. ముఖం తాజాగా ఉంటుంది.
 
ఆయిల్‌ స్కిన్‌ ఉన్న వారికి ముల్తాని మట్టి అద్భుతమైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ముఖంపై ఉన్న ఆయిల్‌, జిడ్డును ముల్తాని మట్టి పోగొడుతుంది. పూర్తి డ్రైస్కిన్‌గా మార్చేస్తుంది. ముల్తాని మట్టిని తేనెతో కలిపి పెట్టుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. తేనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
ఎగ్‌వైట్‌ను ముఖానికి అప్లై చేసుకుని పావుగంట తరువాత కడిగేసుకోవాలి. ఆయిల్‌స్కిన్‌ వారికి ఈ ప్యాక్‌ అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్‌వైట్‌లో ఒక టీస్పూన్‌ నిమ్మరసం, కొంచెం దోసకాయ గుజ్జు వేసి ముఖానికి ప్యాక్‌ మాదిరిగా వేసుకోవచ్చు. 
 
పాలు ముఖానికి మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. పాలలో కొంచెం పసుపు వేసి ఫేస్‌ప్యాక్‌గా వాడుకోవచ్చు. పింపుల్స్‌ కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి