జిరాక్స్‌తో హెచ్‌సీఎల్ ఆరేళ్ల ఒప్పందం ఖరారు

డాక్యుమెంట్ నిర్వహణ సంస్థ జిరాక్స్ కార్పొరేషన్‌తో ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఓ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. తాజాగా రెండు కంపెనీల మధ్య కుదిరిన బదిలీ ఒప్పందం ఆరేళ్లపాటు అమల్లో ఉంటుందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది.

జిరాక్స్ కార్పొరేషన్‌తో మల్టీ రీజినల్ డేటా సెంటర్, ట్రాన్స్‌ఫార్మేషన్ ఒప్పందంలోకి అడుగుపెట్టామని తెలిపింది. హెచ్‌సీఎల్ సామర్థ్యానికి జిరాక్స్‌తో భాగస్వామ్యం ఓ పరీక్ష వంటిదని కంపెనీ పేర్కొంది. జిరాక్స్ సమాచార నిర్వహణ కార్యకలాపాలకు తాము సహాయం చేయనున్నామని హెచ్‌సీఎల్ తెలిపింది.

ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన జిరాక్స్ సమాచార కేంద్రాన్ని తాము నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా జిరాక్స్‌కు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సిస్టమ్ డిజైన్, లైఫ్‌సైకిల్ ఇంప్రూవ్‌మెంట్ కార్యకలాపాల్లో కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తామని పేర్కొంది. సోమవారం లావాదేవీల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వాటాలు 10.54 శాతం పుంజుకొని, ఒక్కో వాటా విలువ రూ.118కి పెరిగింది.

వెబ్దునియా పై చదవండి