రాజ్‌కోట్ వేదికగా భారత్ ‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే

ఆదివారం, 18 అక్టోబరు 2015 (10:21 IST)
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ వేదికగా భారత్ ‌- దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్ల మధ్య నువ్వానేనా అన్నరీతిలో సాగనుంది. ఇండోర్ వన్డేలో ఆల్‌రౌండ్ షో చేసిన మెన్‌ఇన్‌బ్లూ రాజ్‌కోట్‌లోనూ దూకుడు కొనసాగించాలని ధోనీ గ్యాంగ్ గట్టి పట్టుదలతో ఉంది.
 
 
ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరైన సమయంలో ఫామ్‌లోకి రావడంతో పాటు ఇతర బ్యాట్స్‌మెన్లు, గాడిలో పడటం, బౌలర్లు రాణించడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఫామ్ మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే, సఫారీ బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు కూడా భారత పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్ నువ్వానేనా అన్నరీతిలో కొనసాగనుంది. 
 
ఈ మైదానంలో పరుగుల వరద ఖాయమని క్యూరేటర్‌ మక్వానా తెలిపాడు. పిచ్‌ పొడిగా ఉంటుందని, తేమ ప్రభావం ఎక్కువగా ఉండబోదన్నాడు. ఆదివారం వర్షం వచ్చే అవకాశాలు లేవు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదు కావొచ్చు. 
 
అయితే, రాజ్‌కోట్‌ వన్డేకు ఆటంకం కలిగిస్తామని పటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్‌ పటేల్‌ హెచ్చరించడంతో నిర్వాహకులు.. అప్రమత్తమయ్యారు. సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియంతో పాటు నగరంలో వేలాది మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు. ఇక మ్యాచ్‌ టిక్కెట్లతో పాటు ప్రేక్షకులు తమ గుర్తింపు కార్డులు కూడా తీసుకురావాలని తెలిపారు. 
 
ఇరు జట్ల అంచనా.. 
భారత్‌: రోహిత్ శర్మ‌, శిఖర్ ధావన్‌, రహానె, విరాట్ కోహ్లీ,  నీ (కెప్టెన్‌/కీపర్‌), సురేష్ రైనా, అక్షర్ పటేల్‌, హర్భజన్‌, భువనేశ్వర్‌, మోహిత్‌, ఉమేశ్‌. 
దక్షిణాఫ్రికా: డికాక్‌ (కీపర్‌), ఆమ్లా, డుప్లెసిస్‌, డివిల్లీర్స్‌ (కెప్టెన్‌), డుమిని, బెహర్డీన్‌, మిల్లర్‌/మోరిస్‌, స్టెయిన్‌, మోర్కెల్‌, రబాడ, తాహిర్‌. 

వెబ్దునియా పై చదవండి