ఢిల్లీలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సచిన్.. ధర రూ.1.68 కోట్లు.. అంజలి పేరుతో రిజిస్ట్రేషన్

గురువారం, 12 మే 2016 (19:49 IST)
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఢిల్లీలో సొంతింటివాడయ్యాడు. స్థానిక గ్రేటర్ నోయిడా జేపీ గ్రీన్స్‌లో క్రీసెంట్ కోర్ట్ లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లో సచిన్ ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని ధర రూ.1.68 కోట్లు. ఈ ఫ్లాట్ 21వ అంతస్తులో 314 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంది. ఇందులో విలాసవంతమైన ఆరు గదులు ఉన్నాయి.
 
ఈ ఫ్లాట్‌ను తన భార్య అంజలి పేరుమీద సచిన్ రిజిస్టర్ చేయించారు. ఇందుకోసం ఆమె ఓ రోజంతా గ్రేటర్‌ నోయిడా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (జీఎన్‌ఐడిఏ) కార్యాలయంలో గడిపారు. 
 
కాగా, రిజిస్ట్రేషన్‌ కోసం అంజలి రూ.8.40 లక్షల స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. సచిన్ కొనుగోలు చేసిన ఫ్లాట్ గ్రేటర్‌ నోయిడాలో సంపన్నులుండే ప్రాంతం. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, ఫాస్ట్‌బౌలర్‌ ఆర్పీ సింగ్‌లకు సైతం ఆ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు ఉన్నాయి. సచిన్‌కి ఇప్పటికే ముంబైలో రూ.80 కోట్ల విలువ చేసే విల్లా ఉంది. కేరళలో బీచ్‌కు ఆనుకుని మరో విల్లా కూడా ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి