అంతా క్షణాల్లో జరిగిపోయింది : బేలిస్

అంతా క్షణాల్లో జరిగిపోయిందనీ... పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ శ్రీలంక జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ పేర్కొన్నాడు. దాడి సమయంలో లంక జట్టుతోపాటు బస్సులోనే ఉన్న ఆయన.. ఇంకా ఆ సంఘటన నుంచి తేరుకోలేకపోతున్నట్లు చెప్పారు. అసలు ఆ సమయంలో జరిగింది తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని అంటున్నాడు.

దాడి విషయమై బేలిస్ మాట్లాడుతూ... అంతా క్షణాల్లో జరిగిపోయిందనీ, బస్సులో ఉన్న తమకు పేలుడు శబ్దాలు, తుపాకీ చప్పుళ్లు వినిపించాయనీ, అద్దాలు పగిలిపోగా, అందరం బస్సులో కింద పడుకుండిపోయామని వివరించాడు. దాదాపు వంద మీటర్లు ముందుకెళ్లినట్లయితే, స్టేడియం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటామనీ, ఈలోపే ఈ దారుణం జరిగిందని ఆయన వాపోయాడు.

ఇది గమనించిన తమ ఆటగాళ్లు బస్సును ఆపకుండా పోనీయమని కేకలు పెడుతూ డ్రైవర్ మెహర్‌ను అప్రమత్తం చేశారనీ, అదృష్టవశాత్తూ ఆ డ్రైవర్‌కు ఒక్క బుల్లెట్ కూడా తగల్లేదని బేలిస్ వెల్లడించాడు. ఎంతో ధైర్యంగా బస్సును ముందుకు నడిపిన ఆ డ్రైవర్ అక్కడే ఉన్న కార్ల వెనుకవైపు ఆపాడనీ, వెంటనే బస్సు దిగిన తామందరం డ్రెస్సింగ్ రూంలోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నామని గద్గద స్వరంతో చెప్పాడు.

తమలో కొంతమందికి గాయాలయ్యాయనీ, కానీ అదృష్టం కొద్దీ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా తప్పించుకున్నామని బేలిస్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడిదంతా టీవీల్లో చూస్తుంటే, ఒళ్లు భయంతో కంపించిపోతోందనీ, ఇక ఇప్పట్లో మళ్లీ పాక్‌లో అడుగుపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశాడు.

వెబ్దునియా పై చదవండి