ఐపీఎల్‌పై చిదంబరంతో బీసీసీఐ భేటీ

కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరంతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) బుధవారం సమావేశం కానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మ్యాచ్‌ల భద్రతకు సంబంధించి ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఏప్రిల్‌లో భారత్‌లో జరగనున్న రెండోదఫా ఐపీఎల్‌ టోర్నీలో నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం వల్ల, ఐపీఎల్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.

ఈ మేరకు ఎన్నికల తర్వాతనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిండం మంచిదని చిదంబరం బీసీసీఐని కోరారు. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ ఎన్నికల సమయంలో మ్యాచ్‌లు లేకుండా చూసి... రీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు హోంమంత్రితో బీసీసీఐ ఈరోజు భేటీ కానుంది.

ఇదిలా ఉంటే... లంక క్రికెటర్ల దాడితో సంబంధం ఉన్న పదిమంది అనుమానితులను పాకిస్థాన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో నలుగురిని ఆప్ఘనిస్థాన్ పౌరులుగా గుర్తించారు. కాగా, ఈ దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించిన సమాచారం ఇచ్చినవారికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానాను ప్రకటించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి