ఐపీఎల్‌-4లో కొత్త జట్లు: స్వాగతించిన ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో కొత్తగా రెండు జట్లను చేర్చడంపై ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ స్వాగతించాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో సరికొత్త జట్లను ఆహ్వానించిన ఐపీఎల్ యాజమాన్యంపై గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఈ విషయమై కటక్ నగరంలో విలేకరులతో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను చేర్చడం మెచ్చుకోవాల్సిన అంశమన్నాడు. దీనిద్వారా క్రికెటర్లు తమలోని నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఉందని చెప్పాడు. ఐపీఎల్‌లో కొత్త జట్లను చేర్చి విస్తరణ చర్యలు చేపట్టడం ధనార్జన కోసమేనని వస్తున్న వార్తలను గిల్‌క్రిస్ట్ కొట్టిపారేశాడు.

ఇకపోతే.. ఐపీఎల్ మూడో సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ మెరుగైన ఆటతీరుతో రాణిస్తోందని గిల్‌క్రిస్ట్ అన్నాడు. ఇప్పటికే ఐపీఎల్-3లో డెక్కన్ ఛార్జర్స్ సొంత గడ్డపై రెండు విజయాలను సొంతం చేసుకుందని గిల్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్‌తో పాటు జట్టు సభ్యులు ఒత్తిడికి గురయ్యారని, దీంతో జట్టు ఓటమికి గురైందని గిల్ క్రిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా.. ఐపీఎల్-3లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్లీ సేన డెక్కన్ ఛార్జర్స్ వరుసగా మూడో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి