కేంద్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. భద్రతా కారణాల రీత్యా కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ భవిత ప్రశ్నార్థకంగా మారడంతో, ఎలాగైనా సరే ఈ గండం నుంచి గట్టెక్కాలన్న నిర్ణయంతో.. టోర్నీ నిర్వాహకులు ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేసి, తాజా షెడ్యూల్‌ను గురువారం హోంశాఖకు సమర్పించారు.
ఐపీఎల్ సవరించిన తాజా షెడ్యూల్‌ను సమీక్షించిన అనంతరం హోంశాఖ వర్గాలు శుక్రవారం తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. కాగా, మంగళవారం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడి నేపథ్యం ఒకవైపు, మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటం లాంటి కారణాలతో... ఐపీఎల్ జట్లకు తగు భద్రతను అందించలేమని హోంశాఖ తేల్చి చెప్పిన సంగతి విదితమే.
దీంతో... షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఐపీఎల్ నిర్వాహకులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎన్నికలు జరగబోయే తేదీలలో తమ మ్యాచ్‌లు జరుగకుండా ఉండేలా షెడ్యూల్‌ను మార్చినట్లు తెలిపారు. టోర్నీ జరగబోయే పట్టణాలలో పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందూ, పోలింగ్ ముగిసిన అనంతరం రెండు తరువాత మ్యాచ్‌లను నిర్వహించబోమని వారు స్పష్టం చేశారు.
తమ తాజా షెడ్యూల్‌ను హోం మంత్రిత్వ శాఖ పరిశీలించి, సానుకూలంగానే స్పందించగలదని ఐపీఎల్ అధికారిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే... హోంశాఖ గనుక ఐపీఎల్‌ను వాయిదా వేసినట్లయితే... భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)కి దాదాపు 700 కోట్ల రూపాయలకు పైబడే నష్టం వాటిల్లుతుంది.