డ్రైవర్ ఖలీల్‌కు శ్రీలంక ఆహ్వానం

ప్రాణాలకు సైతం తెగించి తీవ్రవాదుల దాడి నుంచి శ్రీలంక క్రికెటర్లను కాపాడిన.. పాకిస్థానీ బస్సు డ్రైవర్ మెహర్ మొహమ్మద్ ఖలీల్‌ను తమ దేశానికి రావాల్సిందిగా శ్రీలంకకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆహ్వానం పలికింది.

ఖలీల్, ఆయన భార్య వారం రోజులపాటు తమ దేశానికి విహార యాత్రకు రావాల్సిందిగా మీడియా సంస్థ పై ఆహ్వానంలో పేర్కొంది. స్వయంగా దేశాధ్యక్షుడు మహేంద్ర రాజపక్షే ఆశీస్సులతో "న్యూస్ పేపర్స్ ఆఫ్ సిలోన్" ఈ మేరకు ఆహ్వానం పలికినట్లు... లంక హై కమీషన్ కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలా ఉంటే... శ్రీలంక క్రికెటర్ల ప్రాణాలను కాపాడి, సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఖలీల్‌కు పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ ఐదు లక్షల రూపాయల నజరానాను ప్రకటించిన సంగతి విదితమే. ఇక లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన టీ షర్ట్, టోపీని ఖలీల్‌కు కానుకగా ఇచ్చాడు.

కాగా, పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గడాఫీ స్టేడియం సమీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో శ్రీలంక అసిస్టెంట్ కోచ్‌తో సహా ఏడుగురు క్రికెటర్లు గాయపడిన సంగతి పాఠకులకు తెలిసిందే..!

వెబ్దునియా పై చదవండి