ఫాస్ట్ పిచ్‌లపై రాణిస్తా : భజ్జీ

ఫాస్ట్ పిచ్‌లపై వెనుకాడేది లేదనీ... వాటిపై కూడా అద్భుతంగా రాణించగలనని టీం ఇండియా స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో విజయవంతంగా రాణించిన భజ్జీ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి విదితమే.

ఈ మేరకు భజ్జీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... కివీస్ పిచ్‌లు స్పిన్ బౌలర్లకు అనుకూలించని మాట వాస్తవమే అయినప్పటికీ.. ఫాస్ట్ పిచ్‌లపైన బౌలింగ్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడబోనని స్పష్టం చేశాడు.

పిచ్‌ను బట్టి బౌలింగ్ తీరు, బౌలర్ల పాత్ర మారుతుందని, ఫాస్ట్ పిచ్‌లపై పరుగులను నియంత్రించడమే తన లక్ష్యమని హర్భజన్ పేర్కొన్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినప్పటికీ, జట్టు విజయం కోసం ఏదో ఒక రకంగా పాటుపడటం ముఖ్యమని భజ్జీ చెబుతున్నాడు.

ఇదిలా ఉంటే... లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడిని ప్రస్తావించిన హర్భజన్.. దాడి విషయం వినగానే అందరం షాక్‌కు గురయ్యామనీ, అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతో వారు బయట పడటంతో పీల్చుకున్నామని చెప్పాడు. లంక క్రికెటర్లందరూసంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని భజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి