బ్రిడ్జి‌టౌన్‌ టెస్ట్ : శర్వాణ్ పరుగుల ప్రవాహం

బ్రిడ్జి‌టౌన్‌లో ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో... వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ రామ్‌నరేశ్ శర్వాణ్ పరుగుల ప్రవాహం కొనసాగించాడు. 452 బంతుల్లో 30 పోర్లు, రెండు సిక్సర్లతో 291 పరుగులు సాధించిన శర్వాణ్ తృటిలో ట్రిఫుల్ సెంచరీని చేజార్చుకున్నాడు.

తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను ఆడిన శర్వాణ్ వెస్టిండీస్‌ జట్టును సురక్షిత స్థితికి చేర్చాడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఇతనికి చక్కటి సహకారాన్ని అందించిన రామ్‌దిన్ కూడా కెరీర్‌లో తొలి సెంచరీతో అదరగొట్టి, 204 బంతుల్లో 11 ఫోర్లతో 101 పరుగుల సాధించి, ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు.

శర్వాణ్, రామ్‌దిన్‌ల జంట ఆరో వికెట్‌కు 261 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆట నాలుగోరోజు ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 398/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 607 పరుగులు సాధించింది.

ఇదిలా ఉంటే... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 600 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి విదితమే. మొత్తానికి శర్వాణ్ ఈ సిరీస్‌లో మంచి జోరుమీద ఉంటూ, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తున్నాడు. కింగ్‌స్టన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 107 పరుగుల సాధించిన శర్వాణ్, సెయింట్ జాన్స్‌లో జరిగిన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 94, రెండో ఇన్నింగ్స్‌లో 106 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి