మార్పులు చేయమన్నాం అంతే : చిదంబరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ టోర్నీని వాయిదా వేయమని చెప్పలేదనీ... షెడ్యూల్‌లో మార్పులు చేయమని మాత్రమే సూచించామని కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. ఐపీఎల్‌ టోర్నీకి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని, ఆటగాళ్లు భారత్‌లో ఆడటంవల్ల కలత చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై చిదంబరం మీడియాతో మాట్లాడుతూ... భారత్‌లో క్రికెట్ ఆడటం పూర్తిగా సురక్షితమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీల సమయంలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండటంపట్ల అభ్యంతరం చెప్పామేగానీ, తాజా షెడ్యూల్‌తో ఎలాంటి సమస్యా లేదని ఆయన చెప్పారు.

ఐపీఎల్ భద్రత కోసం పారా మిలటరీ బలగాలను పంపాలో, వద్దో తనకు తెలుసుననీ... మ్యాచ్‌ల కోసం తమ సామర్థ్యం మేరకు తప్పకుండా సహాయం చేస్తామని చిదంబరం వివరించారు. భారత్‌లో క్రికెట్ ఆడితే పూర్తి సురక్షితంగా ఉండాలనీ, ఇక్కడ క్రికెట్ ఆడుతున్నందుకు ఎవరూ ఆందోళన చెందకూడదన్నదే తమ అభిమతమని ఆయన తెలిపారు.

ఇదిలా ఉంటే... ఐపీఎల్ రెండో సీజన్ భారత్ నుంచి తరలిపోతుందన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన ఛైర్మన్ లలిత్ మోడీ మాట్లాడుతూ.. ఐపీఎల్ భారత్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తరలిపోదనీ, అసలు వీటికి అర్థమే లేదని కొట్టిపారేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ టోర్నీ భారత్‌లోనే జరుగుతుందనీ, ప్రస్తుత వేదికలకు ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి