పాకిస్థాన్‌లో క్రికెట్‌ను బ్రతికించాలని.. ఆ జట్టు కొత్త కెప్టెన్ యూనిస్ ఖాన్ ప్రపంచ క్రికెట్ అధికారులకు విన్నవించుకున్నాడు. లేకపోయినట్లయితే.. పాక్ భవిష్యత్ తరం తీవ్రవాదుల కబంధ హస్తాలలో చిక్కుకుపోయే ప్రమాదం పొంచి ఉందని ఆయన అభ్యర్థించాడు.
ఈ విషయమై యూనిస్ మీడియాతో మాట్లాడుతూ... పాక్‌లో క్రికెట్‌ను చచ్చిపోనివ్వద్దని ప్రపంచ క్రికెట్ అధికారులని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని అర్థిస్తున్నాననీ వ్యాఖ్యానించాడు. తమ దేశంలో ఇక క్రికెట్ జరగబోదని చెప్పడం ఐసీసీ, ఇతర క్రికెట్ పెద్దలకు ఇప్పుడు చాలా తేలికే కానీ, పాక్‌లో క్రికెట్ అనేది లేకుండా పోతే, భవిష్యత్ ఏ మాత్రం బాగుండదని ఆవేదన వ్యక్తం చేశాడు.
లాహోర్‌లో జరిగినదాంట్లో తమ తప్పేమీ లేదనీ, ఇదివరకే పాక్ ఉగ్రవాదం నీడలో ఉంది కాబట్టి... దీన్ని సాకుగా చూపిస్తూ తమ ఆటను చంపవద్దని యూనిస్ వేడుకున్నాడు. ఎవరూ తమ దేశంలో పర్యటించక పోతే, యువ క్రీడాకారులు క్రికెట్‌ను ఎలా నేర్చుకుంటారని ఆయన ఆవేదనగా ప్రశ్నించాడు.
కొంతమంది పిచ్చివాళ్ల కారణంగా పాక్ క్రికెట్ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఐసీసీ, అన్ని క్రికెట్ దేశాల పెద్దలకు ఉందనీ... మంచి మనుషులను తయారు చేసేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని యూనిస్ పేర్కొన్నాడు. ఆటలే లేకుంటే పిల్లలు పనికిరాని పనులు చేస్తారనీ, పిల్లలు చెడిపోవాలని ఎవరూ కోరుకోరు, వారిని బాంబులతో చూడాలని అనుకోరని ఆయన బాధగా వివరించాడు.