రెండో టెస్టు: భారీ స్కోరు దిశగా లంక

లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్ తిలన్‌ సమరవీర (205 బంతుల్లో 19 ఫోర్లతో 133 నాటౌట్‌), కుమార సంగక్కర (210 బంతుల్లో 8 ఫోర్లతో 104) సెంచరీలు చేయడంతో లంక భారీస్కోరు దిశగా పరుగులు తీస్తోంది. స్థానిక గడాఫీ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మొదటిరోజు ఆటముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.

సమరవీర, తిలకరత్నే దిల్షాన్‌ (3) క్రీజులో కొనసాగుతున్నారు. పాక్‌ బౌలర్లలో ఉమర్‌ గుల్‌ మూడు, యాసిర్‌ అరాఫత్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టును పాక్ కెప్టెన్ యూనిస్ ఖాన్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఓపెనర్లు వర్ణపుర (8), పరనవితన (21)లు తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. దీంతో 35 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన లంక జట్టును సంగక్కరతో జతకలిసిన జయవర్ధనే మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు.

అనంతరం సంగక్కర, సమరవీర ఆచితూచి ఆడుతూ వచ్చారు. వీలు దొరికినపుడు బౌండరీలు రాబట్టారు. వీరిద్దరు సెంచరీలు పూర్తిచేశారు. యాసిర్‌ అరాఫత్‌ బౌలింగ్‌లో సంగక్కర వికెట్ల వెనుక కమ్రాన్‌ అక్మల్‌కు దొరికిపోవడంతో 204 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్ మూడు వికెట్లు తీయగా, అరాఫత్ ఒక వికెట్ తీశాడు.

వెబ్దునియా పై చదవండి