ఆతిథ్య న్యూజిలాండ్-టీం ఇండియాల నడుమ జరుగనున్న వన్డే సిరీస్‌లో భాగంగా.. మంగళవారం నేపియర్‌లో తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీం ఇండియా, గడచిన ట్వంటీ20 మ్యాచ్‌లలో జరిగిన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా, ట్వంటీ20లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలతో కసరత్తులు చేస్తోంది.
బ్యాటింగ్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్న టీం ఇండియాలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. ట్వంటీ20 సిరీస్‌కూ దూరంగా ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తిరిగీ జట్టులోకి చేరనుండటంతో... భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అవనుంది.
బౌలింగ్ విషయానికి వస్తే ట్వంటీ20లో జహీర్, హర్భజన్ రాణించి సత్తా చాటారు. అయితే గాయం కారణంగా ఇషాంత్ తొలివన్డేకు దూరం కానున్నాడు. అలాగే టీ20లో విఫలమైన ఇర్ఫాన్‌పఠాన్‌కు చోటు దక్కడం కష్టంగానే ఉంది. వీరి స్థానాల్లో ప్రవీణ్‌కుమార్, మునాఫ్‌పటేల్‌లు తిరిగి జట్టులోకి రావచ్చు. ఒక వేళ ఆల్‌రౌండర్ అవసరం అనుకుంటే ఇర్ఫాన్‌ను కొనసాగిస్తారు.
మరోవైపు టి20 సిరీస్‌ను నెగ్గిన న్యూజిలాండ్ రెట్టించిన విశ్వాసంతో బరిలోకి దిగనుంది. టి20లో మాదిరిగానే రాణించి శుభారంభం చేయాలని వెటోరీ సేన భావిస్తుంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా ప్రతిదాంట్లోనూ న్యూజిలాండ్ ఆటగాళ్లు భారత్‌కు సవాల్ విసురుతున్నారు. ఓపెనర్ మెక్కుల్లమ్ టాప్ ఫాంలో ఉండటం కివీస్‌కు అనుకూలిస్తుంది. టేలర్, రేడర్, గుప్తిల్, ఇలియంట్‌లతో కూడిన యువ బ్యాట్‌సమెన్ అద్భుత ఫాంలో ఉన్నారు. దీనికి తోడు మెరుపులు మెరిపించే జాకబ్ ఓరమ్ ఉంటడం ఆ జట్టుకు కొండంత అండ అని చెప్పుకోవచ్చు.