వారిద్దరూ ఉంటే పరుగుల వరదే : ధోనీ

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు క్రీజ్‌లో ఉన్నట్లయితే... అద్భుతమైన షాట్లతో, ముచ్చటగొలిపే బ్యాటింగ్ విన్యాసంతో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తూ పరుగుల వరద పారిస్తారని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొనియాడాడు.

ఆదివారం కివీస్‌‌తో జరిగిన మూడో వన్డేలో ఘన విజయం సాధించిన అనంతరం ధోనీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... సచిన్ అద్భుతమైన ఆటగాడనీ, అతను ఆడిన షాట్లు చూడముచ్చటగా ఉంటాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక యూవీ ఫామ్‌లో ఉన్నట్లయితే, అతడిని మించిన ప్రమాదకరమైన ఆటగాడు మరొకడు లేడని అన్నాడు. వీరి ఆటతీరుతో స్కోరు బోర్డు పరుగులెత్తుందని ముందుగానే ఊహించామని ధోనీ చెప్పాడు.

తమ బ్యాట్స్‌మెన్‌పై తనకు అపారమైన నమ్మకముందని... ఒక్కోసారి బౌలర్లు తగినంతగా లేకపోతే బ్యాట్స్‌మెన్‌కు పూర్తి సహకారం అందించి, భారీ స్కోరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేస్తామని ధోనీ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో జట్టు తరపున జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని, అలాగే కివీస్‌లోని చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపే విషయంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన బౌలర్లకు సూచించాడు.

వెబ్దునియా పై చదవండి