హమ్మయ్య.. బతికిపోయాం: ధోనీ

బుధవారం, 4 మార్చి 2009 (08:46 IST)
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లక పోవడం తమకు ఎంతో లాభించిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ప్రస్తుతం తాము పాక్‌లో లేకపోవడంతో బతికి పోయామన్నారు.

శ్రీలంక క్రికెట్ జట్టుపై మంగళవారం లాహోర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడికి అసలు లక్ష్యం భారత జట్టేనని, తమ పాకిస్థాన్ పర్యటన రద్దయినందువల్ల అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని జార్ఖండ్ డైనమెట్ అన్నాడు.

పాకిస్థాన్‌లో ఇకముందు పర్యటించదలచుకున్న క్రికెట్ జట్లు చాలా జాగ్రత్తచర్యలు తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, లంక జట్టుపై జరిగిన దాడిని ధోనీతో సహా "టీమ్ ఇండియా" తీవ్రంగా ఖండించింది. దాడి వార్త విన్న వెంటనే ఎంతో మనక్షోభ కలిగిందని, భారతజట్టు దిగ్భ్రాంతికి గురైందని చెప్పాడు.

దాడి జరిగిన సమయంలో నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్ మైదానంలో కివీస్ జట్టుతో భారత్ తొలి వన్డే జరుగుతోంది. ఆట మధ్యలో లాహోర్ దాడి వార్త తెలియగానే కివీస్, భారత జట్లు షాక్‌కు గురైనట్టు చెప్పారు. ఆ తర్వాత రెండు జట్ల సభ్యులు చేతులకు నల్ల బ్యాండ్‌లు ధరించి మ్యాచ్ కొనసాగించారు.

వెబ్దునియా పై చదవండి