2011 ప్రపంచకప్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.కాగా, శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో జరిగిన దాడి నేపథ్యంలో... ప్రపంచకప్ నిర్వహణలో పాకిస్థాన్ ఆతిథ్యాన్ని స్వీకరించేది లేదని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యనిర్వహణ అధికారి జేమ్స్ సదర్లాండ్ మాట్లాడుతూ... అధికారికంగా ఆస్ట్రేలియా, కివీస్‌లు ప్రత్యామ్నాయ అతిథులం అయినప్పటికీ... ఆసియాలోనే ప్రపంచకప్ జరగాలని తాము బలంగా కోరుకుంటున్నట్లు చెప్పాడు. అయితే పాక్‌కు ప్రత్యామ్నాయంగా తాము ఈ టోర్నీని అద్భుతంగా నిర్వహించగలమని అనుకుంటున్నట్లు ఆయన తెలిపాడు.
అయితే ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధం అయ్యేందుకు తగినంత సమయం అవసరమవుతుందని సదర్లాండ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే... 2011 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలంటే, తమ దేశంలో భద్రత మెరుగవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (పీసీబీ) ఇంతియాజ్ భట్ పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో ఆడేందుకు ఏ జట్టూ అంగీకరించదనీ, భద్రత మెరుగవకుండా ఏ జట్టునూ తమ దేశానికి రమ్మని ఆహ్వానించనూ లేమనీ భట్ వాపోయాడు. రాబోయే ఆరు నెలలు, లేదా సంవత్సరంలోపుగా పరిస్థితి మారినట్లయితే 2011 ప్రపంచకప్ ఆతిథ్యంపై ఆశలు పెట్టుకోవచ్చు అని ఆయన వివరించాడు.