కివీస్ దేశీయ క్రికెట్‌లో ఆరుగురు భారతీయులు

న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు ఆదివారం తమ దేశవాళీ టోర్నీలో ఆరుగురు టీం ఇండియా ఆటగాళ్లకు చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇండియన్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ల విషయంలో బీసీసీఐ, కివీస్ క్రికెటర్ల సంఘం మధ్య జరుగుతున్న వాగ్యుద్ధానికి ముగింపు పలికే దిశగా, న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తమ దేశవాళీ టోర్నీలో ఆరుగురు భారత ఆటగాళ్లు ఆడతారని తెలిపింది.

భారత ఆటగాళ్లు ఆడే జట్లలో ఐసీఎల్ ఆటగాళ్లెవరూ ఉండరని స్పష్టం చేసింది. త్వరలో న్యూజీలాండ్, టీం ఇండియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమయ్యేందుకు ఇక్కడికి వచ్చిన టెస్ట్ క్రికెటర్లకు ప్రాక్టీసు కల్పించాలని బీసీసీఐ ఆ దేశ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సచిన్, దినేశ్ కార్తీక్ ఆడాల్సిన ఓ ట్వంటీ- 20 మ్యాచ్‌లో ఐసీఎల్ ఆటగాడు ఒకరు ఉండటంతో, తమ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది.

అనంతరం బీసీసీఐ, కివీస్ క్రికెటర్ల సంఘం మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ వివాదానికి తెరదించుతూ, ఐసీఎల్ క్రికెటర్లు లేని రాష్ట్ర జట్లలో ఆరుగురు టీం ఇండియా టెస్ట్ క్రికెటర్లకు చోటు కల్పిస్తామని న్యూజీలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, అమిత్ మిశ్రా, మురళీ విజయ్, లక్ష్మీపతి బాలాజీ, ధావల్ కులకర్ణిలు న్యూజీలాండ్ స్టేట్ ఛాంపియన్‌షిప్ తరువాతి రెండు రౌండ్లలో ఆడనున్నారు.

వెబ్దునియా పై చదవండి