ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు... ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐపీఎల్ వేదికకు 14 నగరాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
కాగా, భద్రతా ఏర్పాట్లపైన వచ్చే వారంలో సమీక్ష జరుపుతామని మోడీ వివరించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మ్యాచ్‌లు ఉండబోవని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు పాక్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడితో... భద్రత కల్పించలేమంటూ వివిధ రాష్ట్రాల డీజీపీలు చేతులెత్తేయడం తెలిసిన సంగతే.
ఈ నేపథ్యంలో... కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ఆ సమయంలో భద్రత కల్పించలేము కాబట్టి, ఐపీఎల్‌ను వాయిదా వేసుకోమని సూచించిన సంగతి విదితమే. దీంతో... మొదట షెడ్యూలును మార్చేది లేదన్న ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కాస్తంత వెనక్కి తగ్గి త్వరలో కొత్త షెడ్యూలు ప్రకటిస్తామని తెలిపారు.
ఈ మేరకు గురువారం ఇదివరకే తాము ప్రకటించిన షెడ్యూల్లో మార్పులు చేసిన ఐపీఎల్, తుది నిర్ణయం కోసం హోంశాఖ వద్దకు సవరించిన షెడ్యూల్‌ను పంపించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్లో.. పోలింగ్ జరిగే తేదీ రెండు రోజుల ముందు, పోలింగ్ తరువాతి రెండు రోజులలో మ్యాచ్‌లు నిర్వహించబోమని సూచించారు. ఎన్నికల తేదీలు, ఐపీఎల్ మ్యాచ్‌ల తేదీలు రెండూ ఒకేసారి రావడంతో... ఆటగాళ్లకు భద్రత కల్పించడం కష్టతరంగా మారనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ ప్రకటించారు.