దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం

మంగళవారం, 3 మార్చి 2009 (09:38 IST)
జొహానెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుపై ఈ మ్యాచ్‌లో ఆసీస్ 162 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ జాన్సన్ (97 పరుగులు, 8 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆసీస్‌కు ఉపశమనం కలిగించాడు. 454 పరుగుల విజయలక్ష్యంతో, 178/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు ఆసీస్ పేసర్లు అడ్డుకట్టవేశారు. చివరిరోజున పేస్ బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా 291 పరుగులకే ఆలౌటయింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు 1-0 ఆధిక్యత లభించింది.

జాన్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 466 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 220 పరుగులకే ఆలౌటయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 207 పరుగులకే వికెట్లన్నీ కోల్పోయి, ప్రత్యర్థి ముందు 454 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యఛేదనలో నాలుగో రోజు సాయంత్రం వరకు పటిష్టస్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా సోమవారం 291 పరుగుల వద్ద చేతులెత్తేసింది.

వెబ్దునియా పై చదవండి