లాహోర్‌లో ఉగ్రవాద దాడికి గాయపడిన, భయకంపితులైన శ్రీలంక క్రికెట్ జట్టు సభ్యులు పటిష్ట భద్రత నడుమ బుధవారం ఉదయం స్వదేశానికి తిరిగివచ్చారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని శ్రీలంక జట్టు మంగళవారం ఆ దేశం నుంచి బయలుదేరివచ్చిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్‌లో ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న శ్రీలంక జట్టు సభ్యులు ఈ రోజు ఉదయం పటిష్ట భద్రత నడుమ కొలంబో విమానాశ్రయంలో అడుగుపెట్టారని అధికారులు తెలిపారు. ఆటగాళ్ల కుటుంబసభ్యులు జట్టుకు కన్నీటి ఆహ్వానం పలికారు. ఉగ్రవాదులు శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని మంగళవారం లాహోర్‌లోని లిబర్టీ చౌక్ వద్ద విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో గాయపడిన సమరవీరా, పరనవితనలకు పాకిస్థాన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేశారు. కొలంబో చేరుకున్న అనంతరం వీరిద్దరినీ ఆంబులెన్స్‌లో ఎక్కించుకొని, నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే గాయపడిన మరో క్రికెటర్ మెండిస్ కుడి చెవి పక్కన ప్లాస్టర్ అంటించివుంది.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు లంక క్రికెటర్లు, జట్టు సహాయక కోచ్ గాయపడ్డారు. మరో ఎనిమిది మంది పాక్ భద్రతా సిబ్బంది మృతి చెందారు.
దాడిలో గాయపడిన వైస్- కెప్టెన్ కుమార సంగక్కర కొలంబో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించాడు. జట్టు యాజమాన్యం తమను విలేకరులతో మాట్లాడవద్దని సూచించినట్లు తెలిపాడు. ఇదిలా ఉంటే శ్రీలంక క్రీడా శాఖ మంత్రి జెమిని లోకుగే క్రికెట్ జట్టు సభ్యులను విమానాశ్రయంలో పరామర్శించారు.