రాబోయే ప్రపంచకప్ కోసం పాక్ ఆతిథ్యాన్ని స్వీకరించేది లేదనీ.. అక్కడ టోర్నీ మ్యాచ్‌లు ఏవీ జరిపేది లేదనీ... ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ మంగళవారం స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
ఈ విషయమై మోర్గాన్ మాట్లాడుతూ... శ్రీలంక ఆటగాళ్లపై జరిగిన దాడి నేపథ్యాన్ని తీవ్రంగా ఖండించారు. ఆటగాళ్లకు రక్షణ కల్పించటంలో పాక్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున ప్రపంచకప్ మ్యాచ్‌లను అక్కడ నిర్వహించకూడదని బలంగా నిర్ణయించినట్లు ఆయన తేల్చిచెప్పారు. అత్యంత ప్రమాదకరమైన ఆ దేశంలో ఇతర దేశ ఆటగాళ్ల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని ఈ సందర్భంగా మోర్గాన్ వాపోయారు.
ఇదిలా ఉంటే... భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) మాత్రం మరో ఐదు సంవత్సరాలదాకా పాక్‌లో పర్యటించేది లేదని స్పష్టం చేసింది. లంక క్రికెటర్లపై జరిగిన దాడిపట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసిన, బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్... పాక్‌లో భద్రతపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. పాక్‌లో ఇకపై ఏ దేశ క్రికెట్ జట్టు కూడా పర్యటించే పరిస్థితే లేదని అన్నారు.
ఇకపోతే... తమ దేశంలో పర్యటిస్తున్న లంక జట్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం దురదృష్టకరమనీ... వరల్డ్ కప్ నాటికల్లా క్రికెటర్లకు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లను చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించడం గమనార్హం. అయితే పీసీబీ మాటలను ఇప్పుడెవరూ విశ్వసించే పరిస్థితి లేదన్నది మాత్రం వాస్తవం.