బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భద్రతా కారణాల రీత్యా.. తమ దేశంలో పాకిస్థాన్ జట్టుతో జరగబోయే సిరీస్‌ను వాయిదా వేసింది. ఈ మేరకు ఢాకాలో బీసీబీ అధికారులు వెల్లడించిన ఓ ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేశారు.
ఈ విషయమై బీసీబీ మీడియా చీఫ్ జర్నల్ యూనస్ మాట్లాడుతూ... తాము ఈ విషయమై మళ్లీ చెప్పేంతదాకా సిరీస్‌ను వాయిదా వేయాలని హోంమంత్రిత్వ శాఖ సూచించిందనీ చెప్పారు. దీంతో, ప్రభుత్వం సలహా మేరకే తాము సిరీస్ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, సిరీస్‌ను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత చెబుతామని అన్నారు.
ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... పాకిస్థాన్ జట్టు శనివారం బంగ్లాదేశ్ చేరుకుని, రెండు ట్వంటీ20 మ్యాచ్‌లు, 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది. శ్రీలంక జట్టుపై పాకిస్థాన్‌లో జరిగిన దాడి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న బంగ్లా హోంశాఖ.. పాక్ తమ దేశంలో పర్యటించేటప్పుడు ఏదేని అపాయం జరిగినట్లయితే, అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తుందేమోనన్న భయంతోనే సిరీస్‌ను వాయిదా వేసినట్లు ఆ దేశ అధికారవర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.