తామింకా ప్రాణాలతో ఉన్నామంటే... ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో తాము ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తి, తెగువ, సాహసమే కారణమని.. శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్ధనే, ఆ జట్టు మేనేజర్ బ్రెండన్ కురుప్పులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ మెహర్ మొహమ్మద్ ఖలీల్‌పై వీరిరువురూ ప్రశంసల వర్షం కురిపిస్తూ, తమ ప్రాణదాతగా అతన్ని కొనియాడారు.
దాడి ఘటనపై మహేళ మాట్లాడుతూ... "ఫోన్లో మాట్లాడుతూ, కిటికీ అద్దంలోంచి చూడగా, ఇద్దరు వ్యక్తలు తుపాకులు పట్టుకుని రోడ్డుపైకి పరుగెత్తుకుని వస్తూ కనిపించారు. పరుగెత్తుతూనే బస్సుపైకి విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలెట్టారు. విషయం అర్థమై, తామందరం బస్సులో కింద పడుకుండి పోయాము. ఓ వైపు కాల్పుల శబ్దం, మరోవైపు హాహాకారాలు, అయినప్పటికీ బస్సు డ్రైవర్ ఏమాత్రం తొణకకుండా బస్సును ముందుకు నడిపించాడ."ని చెప్పాడు.
తామింకా ప్రాణాలతో బ్రతికి ఉన్నామంటే, అది డ్రైవర్ మెహర్ సాహసమే కారణమనీ, నేరుగా బుల్లెట్లకు ఎదురునిలిచి కూడా ఆయన ఏమాత్రం బెదిరిపోలేదని కురుప్పు, జయవర్ధనేలు వివరించారు. ఆ క్షణంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్ బస్సును అలాగే ముందుకు నడిపాడనీ, ఒకవేళ దాడి మొదలు కాగానే అతను బస్సును నిలిపివేసి ఉన్నట్లయితే... ఉగ్రవాదులకు తాము తేలికగా లక్ష్యమయ్యేవారమని జయవర్థనే తెలిపాడు.
ఉగ్రవాదులు ముందుగా బస్సు చక్రాలను కాల్చివేశారనీ, తరువాత బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారనీ, దాడి జరుగుతోందని గ్రహించేలోపుగానే తాము సీట్లలో నుంచి లేచి కింద పడుకుండిపోయామని జయవర్ధనే వెల్లడించాడు. తర్వాత కాల్పులు ఆగేంతదాకా అలాగే పడుకున్నామని, తమకైన గాయాలన్నీ అద్దాల ముక్కలు, ఇతరత్రా వాటివల్లనే అని, కాల్పుల్లో తూటాల దెబ్బకు ఎవరూ గాయపడలేదని ఆయన స్పష్టం చేశాడు.
దాడిలో ప్రాణాలకు వెరవకుండా, తమను కాపాడిన డ్రైవర్ మెహర్ చేసిన సాహసానికి తామెప్పుడూ రుణపడి ఉంటామనీ, ఆయన మేలును ఎప్పటికీ మర్చిపోలేమని లంక జట్టు సభ్యులు కృతజ్ఞతాభావంతో చెప్పారు. అంతటి దుర్మార్గపు దేశంలో మెహర్ లాంటి మంచి మనుషులు కూడా ఉంటారని, ప్రాణాలకు తెగించి ఆయన చేసిన సాహసమే ప్రపంచానికి రుజువుచేస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు యు మెహర్ మొహమ్మద్ ఖలీల్...!