యూనిస్ నిర్ణయంతో పాక్‌కు తప్పిన ముప్పు

సాధారణంగా భద్రతపై భయాలుండే చోటుకు... రెండు జట్లూ ఒకేసారి బయలుదేరి స్టేడియంకు వెళ్ళటం ఆనవాయితీ. అలాగే భద్రతా సిబ్బంది మొత్తం ఈ కాన్వాయ్‌లో మోహరిస్తుంది కూడా. అయితే మంగళవారం శ్రీలంక జట్టు నిర్ణీత సమయంకంటే ఓ ఐదు నిమిషాల ముందుగానే బయలుదేరింది.

ఇదంతా చూస్తున్న పాకిస్థాన్ కెప్టెన్ యూనిస్ ఖాన్, ఆ జట్టు కోచ్‌తో "వాళ్ళు వెళితే వెళ్లనీయండి. మనం కాసేపాగి వెళ్దాం" అని చెప్పాడట. ఆ సమయంలో యూనిస్ తీసుకున్న నిర్ణయమే తమను కాపాడిందనీ కోచ్ ఇంతికాబ్ ఆలమ్ మీడియాకు వెల్లడించాడు. లేకపోతే తాము కూడా ఉగ్రవాదుల బుల్లెట్ల కోరల్లో చిక్కుకునేవారమని వాపోయాడు.

ఈ విషయమై ఇంతికాబ్ మాట్లాడుతూ... సాధారణంగా 8.40కి హోటల్ నుంచి ప్రయాణమవుతామనీ, నిన్న లంక జట్టు కాస్తంత ముందుగానే బయలుదేరి వెళ్ళారని చెప్పారు. వాళ్లు వెళితే వెళ్లనీయండి.. మనం కాసేపటి తరువాత, కరెక్టు సమయానికి వెళదామని యూనిస్ చెప్పడంతో ఆగిపోయామని వివరించాడు.

గడాఫీ స్టేడియంకు బయలుదేరిన శ్రీలంక జట్టు మాల్ రోడ్డు ప్రాంతానికి చేరుకునేలోపే దాడికి గురయ్యిందనే సమాచారం అందడం, వెంటనే తమను వెనుదిరిగి హోటల్‌కు చేరుకోవాలని ఆదేశాలు అందడం.. వెనువెంటనే జరిగిపోయానని ఆలమ్ పేర్కొన్నాడు. కాగా... యూనిస్‌తో పాటు మరికొంతమంది పాక్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకుని లంక క్రికెటర్లను పరామర్శించినట్లు ఆయన తెలిపాడు.

ఇదిలా ఉంటే... తమ దేశంలో ఆడేందుకు ప్రతిఒక్క జట్టూ వెనుకాడుతున్న సమయంలో ధైర్యంగా పాక్‌కు వచ్చి క్రికెట్ ఆడిన శ్రీలంక జట్టు ధైర్యసాహసాలను పాక్ కెప్టెన్ యూనిస్ కొనియాడాడు. ఉగ్రవాదుల దాడిపై ఏ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయని లంక క్రికెటర్ల స్ఫూర్తిని కొనియాడుతూ... వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి