లంక క్రికెటర్లపై గ్రెనైడ్ దాడి: పోలీసు కమిషనర్

మంగళవారం, 3 మార్చి 2009 (11:09 IST)
శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు గ్రెనైడ్ దాడి నుంచి తృటిలో తప్పిపోయిందని లోహోర్ చీఫ్ పోలీసు కమిషనర్ హబిబుర్ రెహ్మాన్ వెల్లడించారు. క్రికెటర్ల బస్సుపైకి గుర్తు తెలియని వ్యక్తులు గ్రెనైడ్‌ను విసిరి వేశారని, అయితే, అది పేలక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ దాడికి 12 మంది గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడ్డారని తెలిపారు. వీరిలో కొంతమందిని గుర్తించినట్టు చెప్పారు.

కాగా, గాయపడిన వారిలో మహేళ జయర్ధనే, అజంతా మెండీస్, కుమార సంగక్కర, సమరవీర, తరంగాలు ఉన్నట్టు తెలిపారు. చిన్నపాటి గాయాలకు తగిలిన క్రికెటర్లకు ప్రాథమిక చికిత్స చేసి హోటల్‌కు తరలించినట్టు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్రికెటర్లను లాహోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.

గడాఫీ స్టేడియం సమీపంలోని లిబర్టీ మార్కెట్ వద్ద ఐదుగురు సాయుధ తీవ్రవాదులు బస్సుపై దాడి చేశారన్నారు. ఆ తర్వాత మరో 12 మంది తీవ్రవాదులు బస్సులోని క్రికెటర్లపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. సాయుధ తీవ్రవాది ఒకరు బస్సు చక్రాలు, డ్రైవర్‌వైపు కాల్పులు జరిపారన్నారు. ఆ తర్వాత గ్రెనైడ్‌ను విసిరి వేయగా, అది తృటిలో తప్పిపోయిందని కమిషనల్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి